కూడేరు: ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం జరిగిన ఎంపీటీసీల నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ రామానాయుడు ఉన్నట్టుండి కళ్లు తిరిగి కిందపడిపోయాడు. వెంటనే పక్కన ఉన్న వ్యక్తులు అప్రమత్తమై ఏఎస్‌ఐని పట్టుకున్నారు. పోలీసులు ఆయన్ను హుటాహుటిన అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది.
బైక్‌ను ఢీకొన్న కారు: యువకుడి దుర్మరణం
● మరో ఇద్దరికి తీవ్రగాయాలు
కూడేరు: శివరాంపేట సమీపాన అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారిపై శనివారం బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మణం చెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు అందించిన వివరాలు ఉరవకొండ మండలం చిన్న ముష్టూరుకు చెందిన శేషు(26) సురేంద్ర, వంశీతో కలిసి అనంతపురం నుంచి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరారు. శివరాంపేట సమీపాన బళ్లారి నుంచి అనంతపురం వైపు వస్తున్న కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొంది. ఘటనలో బైక్‌పై ఉన్న ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవింగ్ చేస్తున్న మహిళ గాయపడింది. ఇదే సమయంలో బైక్ వెనుక వస్తున్న ఇటుకల ట్రాక్టర్ డ్రైవర్ రోడ్డుపై పడిన యువకులను తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి రోడ్డుపై పడింది. ఆ సమయంలో అటుఇటూ వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లగానే శేషు మృతి చెందాడు. మృతుడి తల్లి అనంతపురంలో ఓ ఆస్పత్రిలో స్వీపర్‌గా పని చేస్తోంది. అతడు వ్యవసాయ కూలీ పనులకు వెళుతుంటాడు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి కన్నీరుమున్నీరైంది.


