● కలెక్టర్ ఆనంద్ ఆదేశం
అనంతపురం న్యూ టౌన్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల మెటీరియల్ పంపిణీ, కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌ని ఎస్పీ పి.జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రంలో నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మెటీరియల్ పంపిణీ సందర్భంగా వర్షం కురిసినా ఇబ్బందులు తలత్తెకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఎన్ని టేబుళ్లు ఏర్పాటు చేస్తారు, ఎన్ని రౌండ్ల కౌంటింగ్ చేపడతారు, రిసెప్షన్ ఏర్పాటు, తదితర అంశాలపై కలెక్టర్ సూచనలు చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు, డీఎస్పీ కరుణాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
స్ట్రాంగ్ రూంల తనిఖీ
ఉరవకొండ: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను శనివారం జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్‌కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక కౌటింగ్ కేంద్రంలో కనీసం నాలుగు టేబుళ్లు పట్టేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించాలన్నారు. డీఎస్పీ శ్రీనివాస్, రిటర్నింగ్ అధికారి సాలురెడ్డి, తహసీల్దార్ అరుణ, ఎంపీడీఓ రవిప్రసాద్, సీఐలు మహనంది, ఈరన్న పాల్గొన్నారు.


