అనంతపురం న్యూ టౌన్ : స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలు చేస్తున్న దురాగతాలపై ప్రశ్నించడమే నేరమా అంటూ జిల్లా పరిషత్ తాజా మాజీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మండిపడ్డారు. ఈనెల 22న నామినేషన్లు సందర్భంగా వైఎస్సార్సీపీకి చెందిన అభ్యర్థులను అనుమతించకపోగా తీవ్రస్థాయిలో పచ్చ గూండాలు దాడి చేయడం అత్యంత దారుణమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తనను విచారణకు రావాలంటూ పోలీస్ నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పాకిస్తాన్లో ఉన్నామా అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా వేధింపులకు గురి చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తన తప్పును గుర్తించి ఈ విధమైన వేధింపులకు స్వస్తి పలకాలని హితవుపలికారు.


