గుంతకల్లు: ప్రశాంతతకు మారుపేరైన గుంతకల్లులో టీడీపీ నాయకులు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, భవిష్యత్తులో వారు ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ నామినేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుతోనైనా టీడీపీ నేతలకు కనువిప్పు కలుగుతుందనుకున్నామని, అయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. నామినేషన్ల కేంద్రాల వద్ద పదుల సంఖ్యలో టీడీపీ గూండాలు కత్తులు, రాళ్లు, కొడవళ్లు చేతబట్టుకుని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను భయపెట్టించి నామినేషన్ పత్రాలను బలవంతగా లాక్కొని చించివేస్తున్నారన్నారు. కసాపురం, చింతలాంపల్లి, నక్కనదొడ్డి, నెలగొండ. జి.కొట్టాల అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పోలీసుల సమక్షంలోనే చించేశారని మండిపడ్డారు. గుత్తి మున్సిపాల్టీ అభ్యర్థి అంజల మూడు సెట్లు నామినేషన్లు వేస్తే..అందులోని కొన్ని పత్రాలను మాయం చేసి స్క్రూట్నీలో ఇన్‌వాలిడ్ చేశారని ఆరోపించారు. అధికారులు, పోలీసుల కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. పామిడి 6వ వార్డు అభ్యర్థి రమేష్‌పై కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. చింతలాంపల్లి ఎంపీటీసీ అభ్యర్థి భర్త బొజ్జనపై ఎంపీడీఓ కార్యాలయం వద్ద పోలీసుల సమక్షంలోనే దాడి చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేయడానికి వెళ్లగా ఆమెను బలవంతంగా బయటకు నెట్టివేశారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, సీనియర్ నేతలు జింకల రామాంజినేయులు, ఎద్దుల శంకర్, పట్టణ, రూరల్ అధ్యక్షులు ఖలీల్, రాము, ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.గోవింద్‌నాయక్, నాయకులు వినోద్‌కుమార్‌రెడ్డి, బాబురావు, రంగనాయకులు జయరామిరెడ్డి, వినోద్‌కుమార్ రెడ్డి, లింగన్న. అబ్దుల్‌బాసిద్, తిక్కస్వామి, బెస్త మనోహర్, సోమిరెడ్డి, పవన్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
పోలీసులు, అధికారుల కనుసన్నల్లోనే టీడీపీ దౌర్జన్యాలు
టీడీపీ నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదు
మాజీ ఎమ్మెల్యే వైవీఆర్


