● రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి ● తల్లికి తీవ్రగాయాలు
గుంతకల్లు రూరల్: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనార్థం వెళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఘటనలో తండ్రీకుమారుడు మృతి చెందారు. తల్లి తీవ్రగాయాలపాలైంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గుంతకల్లు మండలం నెలగొండ గ్రామానికి చెందిన దేవన్నగారి రమేష్ గుంతకల్లులోని ఓ ఫర్టిలైజర్ షాపులో పని చేసేవాడు. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనార్థం భార్య, ఇద్దరు కుమారులతో కలిసి గురువారం ఉదయం ఇంటి నుంచి బైక్‌పై రైలులో వెళ్లేందుకు గుంతకల్లుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో దోనిముక్కల సమీపంలో ఎదురుగా వస్తున్న కారు బైకును ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన రమేష్(38) అతడి కుమారుడు మోక్షిత్ (8) అక్కడికక్కడే మృతి చెందారు. భార్య గీత, మరో కుమారుడు ప్రణీత్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం తీసుకెళ్లారు.
విమల స్మారక పురస్కారాల విజేతలు వీరే..
అనంతపురం కల్చరల్: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా అందించే ‘విమల స్మారకశాంతి కథా పురస్కారాల విజేతలను డాక్టర్ శాంతి నారాయణ గురువారం వెల్లడించారు. ‘ఇల్లిడిసిన తొమ్మిది కథలు’ రాసిన మారుతీ పౌరోహితం, స్వర్ణకిలారి రచించిన ‘గోడవతల’ కథా సంపుటాలు ఈ ఏడాది విమలా స్మారక పురస్కారాలకు ఎంపిక చేశామన్నారు. వీరందరికీ త్వరలో నగదు పురస్కారంతో పాటు ఘనంగా సత్కరించనున్నట్లు శాంతినారాయణ పేర్కొన్నారు.
మృతి చెందిన రమేష్(ఫైల్), మోక్షిత్(ఫైల్)


