గుంతకల్లు రూరల్: మండలంలోని పాతకొత్తచెరువు వద్ద గుంతకల్లు– గుత్తి జాతీ య రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్వర్లు (60) దుర్మరణం చెందాడు. రూరల్ ఎస్‌ఐ బాలముణి తెలిపిన మేరకు.. గుంతకల్లు మిల్లు కాలనీలో భార్య పార్వతి, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు గుజిరీ వస్తువులు సేకరించి, విక్రయిస్తూ జీవనం సాగిస్తు న్నాడు. మంగళవారం సాయంత్రం గుజిరీలో వస్తువులు తీసుకెళ్తుండగా పాతకొత్తచెరువు సమీపంలోని ముష్కిషావలీ దర్గా వద్ద రోడ్డు దాటే క్రమంలో గుంతకల్లు నుంచి గుత్తి వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వాహనదారుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
‘నామినేషన్ వేస్తే
అంతు చూస్తాం’
అనంతపురం: ‘ ప్రభుత్వం మాది.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం.. నీకు తెలియదా? ..ఎంపీటీసీ అభ్యర్థిగా నువ్వు ఎలా పోటీ చేస్తావ్.. నువ్వు నామినేషన్ వేస్తే నీ అంతు చూస్తాం..’ అంటూ టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులను బెదిరించారు. వివరాలు.. గార్లదిన్నె మండల పరిధిలోని ముంటిమడుగు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ నాయకుడు తలారి సుబ్బరాయుడు భార్య సునీత నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో భాగంగా భర్త తలారి సుబ్బరాయుడు, నాయకులు వెంకటయ్య ఇద్దరు నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రా లు సిద్ధం చేసుకునేందుకు బుధవారం గార్లదిన్నెకు వెళ్లి, మీ సేవా కేంద్రం వద్ద ఉన్నారు. ఆ సమయంలో ముంటిమడుగుకు చెందిన టీడీపీ నాయ కులు కారులో వచ్చి వెఎస్సార్‌సీపీ నాయకులను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి ముంటిమడుగులోని టీడీపీ నాయకుడి ఇంటికి తీసుకెళ్లారు. ‘నీవు పోటీ నుంచి తప్పుకో.. లేకుంటే ఇబ్బంది పడుతావ్.. అధికారంలో ఉండేది మా ప్రభుత్వం.. మీరు ఏమీ చేసుకోలేరు.. అంటూ బెదిరించినట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశా రు. అనంతరం తిరిగి వారి కారులోనే గార్లదిన్నెలో వదిలి వెళ్లిపోయినట్లు తెలిపారు. మేము నామి నేషన్ వేసేందుకు ఎన్నికల అధికారులు, పోలీస్‌లు చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.
విత్‌డ్రా చేసుకోవాలని
బెదిరింపులు
గుంతకల్లుటౌన్: పట్టణంలోని 23వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో దిగనున్న డి.జరీనా భర్త విష్ణును అదే వార్డుకు చెందిన పలువురు టీడీపీ నాయకులు బెదిరించినట్లు విష్ణు విలేకరులకు తెలిపారు. తన భార్య తరఫున పార్టీ బీ–ఫారం మున్సిపల్ ఆఫీసులో ఎన్నికల అధికారికి అందజేయడానికి రాగానే అక్కడే ఉన్న టీడీపీ నాయకులు బీ–ఫారం లాక్కునేందుకు యత్నించారు. అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా.. అసభ్య పదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న వన్‌టౌన్ సీఐ శ్రీధర్, ఎస్‌ఐలు సురేష్, కళ్యాణ్‌లు జోక్యం చేసుకొని టీడీపీ నాయకులను అక్కడి నుంచి పంపివేయడంతో విష్ణు బీ–ఫారంను ఎన్నికల అధికారికి సమర్పించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పార్టీ నాయకులను అక్కడికి పంపి విష్ణును క్షేమంగా పార్టీ కార్యాలయానికి చేర్చారు.
సీఐఐ సదస్సుకు ఏర్పాట్లు
అనంతపురం అర్బన్: జేఎన్‌టీయూ వేదికగా ఈనెల 23న జరగనున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్–2026 సదస్సు నిర్వహణకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జేఎన్‌టీయూలో సదస్సు నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను జేసీ బుధవారం పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఏపీఈడీబీ) ఆధ్వర్యంలో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ఈనెల 23న జేఎన్‌టీయూలోని ఎన్‌టీఆర్ ఆడిటోరియంలో జరగనుందన్నారు. సదస్సు నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు గురువారానికి పూర్తి చేయాలని ఆదేశించారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు వసతి సదుపాయం కల్పించాలన్నారు. రిజిస్టేషన్ ప్రక్రియ, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, ఎంఎస్‌ఎంఈ ఎగ్జిబిషన్, భోజన వసతి, తదితర అన్ని ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్‌కుమార్, ఆర్‌డీఓ ప్రేమంత్‌కుమార్, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసయాదవ్, ఏపీఐఐసీ జెడ్‌ఎం నాగకుమార్, డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, ఈడీబీ రామకృష్ణ, ఈమెంట్ మేనేజర్ కిశోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


