● వైఎస్సార్‌సీపీ, సీపీఐ అభ్యర్థులను గెలిపించండి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
అనంతపురం: నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి ఓటు వేస్తే ప్రజలు అవినీతికి అనుమతి ఇచ్చినట్లేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. నగరం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. బుధవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మేయర్ స్థానంతో పాటు 60 కార్పొరేటర్ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, మరో రెండు కార్పొరేటర్ స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అనంతపురంలో దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు ప్రశాంతంగా ఉన్న నగరంలో, గడిచిన ఈ రెండున్నరేళ్లలో పరిస్థితులు ఎలా మారాయో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బెదిరింపులు ఎక్కువయ్యాయని, ప్రచారం చేస్తే దాడులు చేస్తామని, కేసులు పెడతామని మధ్యవర్తులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 19 చోట్ల నామినేషన్ల స్వీకరణకు సమయం ఇవ్వడం చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకుడు బోరెడ్డి నరేష్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి సరైన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మాట్లాడుతూ నామినేషన్ల పర్వంలో అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుందన్నారు. గుత్తి మునిసిపాలిటీతో పాటు ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అరాచకం సృష్టిస్తోందని ధ్వజమెత్తారు.
మన అనంతపురాన్ని మనం కాపాడుకుందాం
‘మన అనంతపురాన్ని మనం కాపాడుకుందాం’ నినాదంతో ఎన్నికల్లో ముందుకు వెళ్తామని వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ తెలిపారు. 2014–19 మధ్య మూడు ముక్కలాటగా ఉన్న పాలనను చూశామని, 2019–24 మధ్య అనంత వెంకటరామిరెడ్డి నాయకత్వంలో 50 డివిజన్లలో రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి, ప్రతి ఇంటికీ సంక్షేమం అందించామని గుర్తు చేశారు. గత రెండున్నరేళ్ల కూటమి పాలనలో చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ఆస్తులకు, శాంతిభద్రతలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మేధావులు, ఉద్యోగులు, ప్రజలు ఆలోచించి వైఎస్సార్‌సీపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకుడు చవ్వా రాజశేఖరరెడ్డి, పీఏసీ సభ్యుడు మహాలక్ష్మీ శ్రీనివాస్, మాజీ మేయర్ వసీం, సీఈసీ సభ్యులు నదీం అహ్మద్, మీసాల రంగన్న, ఎస్‌ఈసీ సభ్యులు కోగటం విజయభాస్కరరెడ్డి, సీనియర్ నాయకులు వైటీ శివారెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్, నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, గువ్వల రాజేష్‌రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, సాంస్కృతిక విభాగం నగర కార్యదర్శి కేశవరెడ్డి పాల్గొన్నారు.


