రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు సలకంచెరువు విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు సలకంచెరువు విద్యార్థులు

Oct 10 2026 1:40 AM | Updated on Oct 10 2026 1:40 AM

శింగనమల: మండలంలోని సలకంచెరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆరుగురు రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం ఎలిజెబెత్‌, పీడీ నరసింహారెడ్డి శుక్రవారం తెలిపారు. నాలుగు రోజులుగా అనంతపురంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్‌–14 విభాగంలో 8వ తరగతి విద్యార్థిని పూజిత, అండర్‌–17 విభాగంలో 10వ తరగతి విద్యార్థులు రేవతి, నాగమలేశ్వరి, శశికళ, కార్తీక్‌, వినయ్‌కుమార్‌ ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈసందర్భంగా హెచ్‌ఎం, పీడీతోపాటు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ఇదిలా ఉండగా పాఠశాలకు పూర్వ విద్యార్థి గాండ్ల ఉమామహేశ్వరి 16 కుర్చీలు వితరణ చేసినట్లు హెచ్‌ఎం తెలిపారు.

బాలిక అదృశ్యం

డి.హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌): మండలంలోని సోమలాపురానికి చెందిన 17 ఏళ్ల బాలిక రెండు రోజులుగా కనిపించకుండా పోవడం స్ధానికంగా చర్చనీయాంశంగా మారింది. బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తల్లి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన్నట్లు ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు. బాలిక ఆచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చుట్టు పక్కల గ్రామాల్లో గాలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

హోటల్‌ యజమాని మృతి

గుంతకల్లుటౌన్‌: కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్‌ జిల్లా ఇల్‌కల్‌ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన హైదరాబాద్‌ బిర్యానీ హోటల్‌ యజమాని షేక్‌ ఇమ్రాన్‌ అలియాస్‌ లడ్డూ(36) మృతి చెందాడు. త్వరలో గుంతకల్లులో ప్రారంభించనున్న బేకరీకి సంబంధించిన అధునాతన మిషనరీ కొనుగోలు కోసం మూడు రోజుల క్రితం తన స్కార్పియో వాహనంలో మిత్రుడు నూర్‌తో కలిసి ముంబైకి వెళ్లి తిరిగి పయనమయ్యాడు. ఇల్‌కల్‌ వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి వేగంగా వెళ్లి ఢివైడర్‌ను ఢీకొనడంతో ముందు సీటులో కూర్చున్న ఇమ్రాన్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు. డ్రైవింగ్‌ చేస్తున్న నూర్‌ గాయాలపాలయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు, మిత్రులంతా ఇల్‌కల్‌కు వెళ్లారు. మృతుడికి భార్య ఆయేషా, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇమ్రాన్‌ మృతితో స్థానిక పోర్టర్స్‌లైన్‌లోని వారి నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

రైలు కిందపడి కర్ణాటక యువకుడి ఆత్మహత్య

పామిడి: కుటుంబ కలహాలతో రైలు కిందపడి కర్ణాటకకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తి జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు అందించిన వివరాలు.. కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడ తాలూకా క్యాతగానచెర్లు గ్రామానికి చెందిన కేజీ దేవరాజు (23) గురువారం తండ్రి గోపాలప్పతో తగువులాడి ఇంట్లో నుంచి వచ్చేశాడు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం స్థానిక కేజీబీవీ స్కూల్‌ సమీపాన గుత్తి నుంచి అనంతపురం వైపునకు వెళ్తున్న రైలుకింద దూరాడు. ఘటనలో శరీరం తునాతునకలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించాడు. మృతుడి వద్ద ఉన్న ఓటరు, ఆధార్‌కార్డు ఆధారంగా ఆచూకీని గుర్తించారు. మృతదేహాన్ని గుత్తి ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు.

జీజీహెచ్‌లోని వంట శాలలో రాగి పాత్రలు మాయం!

అనంతపురం సిటీ: జిల్లా సర్వజనాస్పత్రిలోని వంట శాలలో సుమారు రూ.15 లక్షల విలువైన రాగి పాత్రలు కనిపించకుండా పోయిన వైనం శుక్రవారం కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై జీజీహెచ్‌ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సమగ్ర విచారణ అనంతరం నేడో.. రేపో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. కాగా, రాగి పాత్రలు మాయం కావడం ఇంటి దొంగల పనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంట శాలలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా కొంత కాలంగా రాగిపాత్రలను బయటకు తరలించి సొమ్ము చేసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ అంశాన్ని జీజీహెచ్‌ ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమగ్ర విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement