ఎన్నాళ్లకెన్నాళ్లకు | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నాళ్లకు

Sep 21 2026 6:29 AM | Updated on Sep 21 2026 6:29 AM

●జలపాతాల కనువిందు
భారీ వర్షాలతో యాడికి మండలంలోని కోనుప్పలపాడు వద్ద కోన, మారడమ్మ జలపాతాలు కళ సంతరించుకున్నాయి. పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. జలపాతాలను చూసేందుకు ప్రజలు తరలి వచ్చారు. పరిసరాల్లో ఉల్లాసంగా గడిపారు. – యాడికి:

అనంతపురం అగ్రికల్చర్‌: మూడు నెలల పాటు జాడలేకుండా పోయిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు డీ.హీరేహాళ్‌, రాయదుర్గం, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం మినహా 28 మండలాల్లో వర్షాలు కురిశాయి. ఒకే రోజు ఏకంగా 43.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఈ సీజ న్‌లో ఇదే అత్యధిక సగటు కావడం గమనార్హం. అత్యధికంగా యాడికి మండలంలో 97.6 మి.మీ, నార్పల 86.8, బొమ్మనహాళ్‌ 80.2, పామిడి 80, తాడిపత్రి 73.4, పెద్దవడుగూరు 72.4 మేర వర్షపాతం నమోదైంది. అలాగే యల్లనూరు 69.6 మి.మీ, ఆత్మకూరు 63.2, గార్లదిన్నె 62.4, ఉరవకొండ 62.2, పుట్లూరు 58.2, వజ్రకరూరు 55.2, బెళుగుప్ప 48.6, గుంతకల్లు 48, పెద్దపప్పూరు 46.8, అనంతపురం రూరల్‌ 43.6, బుక్కరాయసముద్రం 42.2, గుత్తి 40.4, అనంతపురం అర్బన్‌ 39.2, రాప్తాడు 34.2, కూడేరు 32.4, శింగనమల 30.4, కళ్యాణదుర్గం 30.2, కుందుర్పి 20.6, కంబదూరు 14.4, శెట్టూరు 10.6, కణేకల్లు 10 మి.మీ మేర వర్షం కురిసింది. ఆగస్టు సాధారణం 111.6 మి.మీ కాగా ప్రస్తుతానికి 49.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 269.5 మి.మీ గానూ 36.7 శాతం తక్కువగా 170.6 మి.మీ నమోదు కావడం గమనార్హం. సీజన్‌లో తొలిసారిగా కొన్ని మండలాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహించాయి.

ఉపయోగం లేదంటున్న రైతులు..

జిల్లా వ్యాప్తంగా అరకొర తేమలో ఖరీఫ్‌ కింద సాగు చేసిన 2.57 లక్షల ఎకరాల పంటలు ఇప్పటికే చాలా వరకు ఎండిపోయాయి. అక్కడక్కడా పంటలు తొలగించేశారు. చాలా ఆలస్యంగా కురిసిన ఈ వర్షాలతో ఖరీఫ్‌ పంటలకు ఎలాంటి ఉపయోగం లేదని రైతులు చెబుతున్నారు. కంది మినహా వేరుశనగ, ఆముదం, పత్తికి ఉపయోగం లేదంటున్నారు. ప్రత్యామ్నాయ పంటలతో పాటు రబీలో పప్పుశనగ సాగుకు కొంత వరకు ఊరటనిస్తాయని చెబుతున్నారు. పశుగ్రాసం, పండ్లతోటలకు ఉపశమనం లభించే అవకాశం ఉందంటున్నారు.

విత్తనం కోసం ఎదురుచూపు..

80 శాతం సబ్సిడీతో 30 వేల క్వింటాళ్ల ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణీ చేస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు వేయి క్వింటాళ్లు కూడా అందివ్వకపోవడంతో సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. నల్లరేగళ్లు కలిగిన 25 మండలాల పరిధిలో రబీ కింద పప్పుశనగ పంట సాగుకు సిద్ధంగా ఉన్నా ఇంకా విత్తన పంపిణీ ఏర్పాట్లు చేయకపోవడంతో వర్షం వచ్చినా ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉన్నట్లు రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎట్టకేలకు ఓ మంచి వర్షం

ఒకే రోజు 43.5 మి.మీ

భారీ వర్షపాతం

నాలుగు మండలాలు మినహా

జిల్లా అంతటా వాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement