రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం బళ్లారిరోడ్డు రాచానపల్లి సమీపంలోని ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల హాస్టల్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.నార్పల మండలం జంగంరెడ్డిపల్లికి చెందిన కొవ్వూరి అమృతకుమార్‌రెడ్డి, ధర్మవరానికి చెందిన మనోహర్‌రెడ్డి శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కళాశాల నుంచి బయటకు వెళ్లారు. ఓ మద్యం దుకాణం సమీపంలో కనిపించగా, కళాశాల యాజమాన్యం వారిని చూసింది. దీంతో అక్కడి నుంచి పరారైన విద్యార్థులు రాత్రి 9 గంటలకు హాస్టల్‌కు చేరుకున్నారు. ఈ విషయంపై యాజమాన్యం వారిని మందలించడంతో పాటు, వారి ఎదుటే తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆదివారం కళాశాలకు రావాలని సమాచారం ఇచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరు విద్యార్థులు తెల్లవారుజామున హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. అమృతకుమార్‌రెడ్డి తండ్రి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ శ్రీకాంత్‌యాదవ్ ఆదివారం రాత్రి కళాశాలకు వెళ్లి యాజమాన్యాన్ని, విద్యార్థులను విచారించారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96811 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
విద్యార్థులకు వక్తృత్వ పోటీలు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ‘వికసిత్ భారత్– 2047’ అంశంపై చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని డీఈఓ అయ్యూబ్ హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు ఆసక్తి ఉన్న విద్యార్థులను పోటీల్లో తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని సూచించారు. సోమ వారం పాఠశాల స్థాయిలో నిర్వహించి విజేతల వివరాలను సంబంధిత డీవైఈఓ కార్యాలయాల్లో అందజేయాలని ఆదేశించారు.
బియ్యం అక్రమ తరలింపుపై
ఎంజేపీలో విచారణ
● గుట్టుగా చేపట్టడంపై సర్వత్రా విమర్శలు
నార్పల: మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే(ఎంజేపీ) బాలికల గురుకుల పాఠశాలలో బియ్యం అక్రమ తరలింపుపై ఆదివారం అధికారులు విచారణ చేపట్టారు. విజయవాడ నుంచి వచ్చిన రాష్ట్ర వెల్ఫేర్ డిప్యూటీ సెక్రటరీ సుభాషిణి దేవమ్మ, అనంతపురం డీడీ కుష్బూ కొఠారి, అబ్జర్వర్ ప్రిన్సిపాల్ హర్షద్‌వలి సమక్షంలో విచారణ జరిపారు. అయితే, పాఠశాల గేట్లను మూసివేసి బయటి వ్యక్తులను లోపలికి అనుమతించకుండా గుట్టుగా విచారణ చేయడంపై వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ప్రిన్సిపాల్ కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులతో అధికారులకు అనుకూలంగా సమాధానాలు ఇప్పించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బియ్యం అక్రమ తరలింపుతో పాటు ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
జేసీ అనుచరుల దాష్టీకం
● వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడి
తాడిపత్రిటౌన్: జేసీ అనుచరుల దాష్టీ కాలు ఆగడం లేదు. తాజాగా తాడిపత్రి పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో వైఎస్సార్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ హరినాథరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఆదివారం హరినాథరెడ్డి పట్టణంలోని సుంకులమ్మపాలెంలో ఉన్న తన ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు మూడు వాహనాల్లో అనుసరించారు. కూరగాయల మార్కెట్ సమీపంలో ఢీకొట్టారు. కిందపడిన హరినాథరెడ్డిపై ముఖాలకు మాస్కులు వేసుకున్న 15 మంది కర్రలు, రాడ్లతో దాడి చేశారు. స్థానికులు కేకలు వేయడంతో పారిపోయారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఘటనా స్థలానికి వెళ్లి హరినాథరెడ్డిని చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు.


