అనంతపురం సెంట్రల్: అనంతపురం వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు పడింది. వీఆర్‌కు పంపుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న కరుణాకర్‌ను వన్‌టౌన్ సీఐగా నియమించారు. ధర్మవరం, పెనుకొండ, జమ్మలమడుగు, బుక్కరాయసముద్రంలో సీఐగా కరుణాకర్ పనిచేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు.
వివాదాలు.. తీవ్ర ఆరోపణలు..
సీఐ వెంకటేశ్వర్లు వ్యవహార శైలి ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వినాయక చవితిని పురస్కరించుకుని అనంతపురంలో కొన్ని రోజుల క్రితం నిర్వహించిన ‘ఆగమన్’ కార్యక్రమం సందర్భంగా అక్కడి వారిపై సీఐ వెంకటేశ్వర్లు చిందులు తొక్కారు. దుర్భాషలాడడంతో పాటు దాడికి పాల్పడినట్లు తెలిసింది. దీనిపై కొంతమంది టీడీపీ నాయకులు పోలీసుస్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఇన్‌చార్జ్ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇక సీఐ వెంకటేశ్వర్లు పోలీసుస్టేషన్‌లోనూ సిబ్బందిని దుర్భాషలాడేవారని, స్టేషన్ విషయాలు బయటకు పొక్కితే ఒక్కొక్కరి కథ తేలుస్తానంటూ బెదిరింపులకు పాల్పడేవారని తెలిసింది. ఇటీవల స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలు కూడా గాడి తప్పాయి. వన్‌టౌన్ పరిధిలోని శారద నగర్‌లో కొందరు ఏకంగా ప్రింటింగ్ మిషన్ ఏర్పాటు చేసుకుని నకిలీ నోట్లు తయారు చేస్తున్న వైనం కలకలం సృష్టించింది. విజయవాడ పోలీసులు గుట్టురట్టు చేసేంత వరకూ స్థానిక పోలీసులు దీన్ని గుర్తించలేకపోయారు. మద్యం షాపుల నుంచి నెలవారీ మామూళ్లు, తదితర అంశాలపై కూడా వెంకటేశ్వర్లుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను వీఆర్‌కు పంపుతూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నూతన సీఐగా కరుణాకర్


