కళ్యాణదుర్గం: అధికార అండతో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. నిబంధనలను పక్కనబెట్టి పట్టపగలే కొండను పిండి చేస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా చోద్యం చూస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. కళ్యాణదుర్గంలో వాల్మీకి సర్కిల్ సమీపంలోని ఆంజనేయ స్వామి కొండ పొరంబోకు స్థలం(సర్వే నంబర్ 421)లో టీడీపీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బిక్కి రామలక్ష్మి భర్త బిక్కి గోవిందప్ప (ఖైదీ గోవిందప్ప) బ్లాస్టింగ్ చేస్తూ కొండను కరిగిస్తున్నాడు. స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడ సెంటు స్థలం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన రూ.2 కోట్లకు పైగా విలువైన 20 సెంట్లను కాజేసేందుకు ఎత్తుగడ వేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రోద్బలంతోనే కొండను ‘బిక్కి’ కరిగించేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
అల్లుడికి ఆస్పత్రి నిర్మించేందుకు..!
బిక్కి గోవిందప్ప అల్లుడు నియోజకవర్గంలోని ఓ మండలంలో ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. పట్టణంలోని వాల్మీకి సర్కిల్‌లో ఇటీవల ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యుడిగా సేవలందిస్తూనే మరోవైపు సొంత ఆసుపత్రి ద్వారా ఆర్జన సాగిస్తున్నారు. ఈ క్రమంలో తన అల్లుడికి శాశ్వత ఆసుపత్రి నిర్మాణం చేసేందుకు కొండ వద్ద స్థలం ఆక్రమణకు తెరతీసినట్లు తెలిసింది. గతంలో ఓ చర్చి నిర్వాహకులు తీసుకున్న స్థలంపై కన్నేసి వారిని భయపెట్టి ఖాళీ చేయించినట్లు సమాచారం.
చోద్యం చూస్తున్న అధికారులు..
వాల్మీకి సర్కిల్ సమీపంలో పట్టపగలే బ్లాస్టింగ్ చేస్తున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తుండడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ భాస్కర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
కొండ పొరంబోకులో
యథేచ్ఛగా బ్లాస్టింగ్
రూ.2 కోట్లకు పైగా విలువైన స్థలం
ఆక్రమణకు పన్నాగం
చోద్యం చూస్తున్న రెవెన్యూ,
మైనింగ్ అధికారులు


