కుందుర్పి: మండలంలోని రుద్రంపల్లికి చెందిన బోయ హరికృష్ణ (22) జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.. బోయ బొమ్మిరెడ్డి రెండో కుమారుడు హరికృష్ణ తాగుడుకు బానిసయ్యాడు. జులాయిగా తిరిగేవాడు. కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం తాగుడు మానేయాలని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన హరికృష్ణ.. గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పశువుల కాపర్లు విషయాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో తండ్రి బొమ్మిరెడ్డి ఫిర్యాదు మేరకు కుందుర్పి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ
అనంతపురం న్యూ టౌన్: పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్య మని వక్తలు స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని ఉపాధ్యాయ భవన్లో భవన్‌లో జిల్లాస్థాయి పర్యావరణ వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లా స్థాయిలోని గ్రీన్ టీచర్లు, విద్యార్థులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ క్రాప్స్ రాష్ట్ర కోఆర్డినేటర్ నీలకంఠ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. నీటి సంరక్షణ చర్యలను చేపడుతూనే, ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా తగ్గించినప్పుడే ప్రకృతిలో పర్యావరణం సాధ్యమవుతుందన్నారు. ఉపాధ్యాయులందరూ విధిగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎన్‌జీసీ జిల్లా కోఆర్డినేటర్ కావూరి విజయ్‌కుమార్, అనంతపురం క్లస్టర్ కోఆర్డినేటర్ రవికుమార్, శైలజ, ప్రేమనాథరెడ్డి, అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లుకు చెందిన ఉపాధ్యాయులు, 16 మండలాల పర్యావరణ పరిరక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
21 నుంచి జిల్లావ్యాప్తంగా కరువు దీక్షలు
అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 23 వరకు కరవు దీక్షలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జగదీష్ మాట్లాడుతూ ఎల్‌నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయకుడు కరువుపై చర్చించకపోవడం బాధాకరమన్నారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించడం లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు జాఫర్, సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సంజీవప్ప, రామకృష్ణ, కేశవరెడ్డి, గోపాల్, టి.నారాయణస్వామి, పద్మావతి పాల్గొన్నారు.
నిమజ్జనంలో కత్తులతో దాడి
అనంతపురం సెంట్రల్: నగరంలో ఇందిరానగర్‌లో వినాయక నిమజ్జనంలో ఇద్దరు యువకులు కత్తులతో దాడి చేసుకున్నారు. అనిల్‌కుమార్ అనే యువకుడిపై వినయ్ అనే యువకుడు కత్తితో ఛాతీలో పొడిచాడు. దీంతో నిమజ్జన వేడుకలో ఒక్కసారి కలకలం రేగింది. తీవ్రంగా గాయపడిన అనిల్‌కుమార్‌ను క్షతగాత్రులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


