అనంతపురం అగ్రికల్చర్/యల్లనూరు: ఫ్రూట్‌బౌల్ ఆఫ్ ఏపీగా ఖ్యాతినొంది, ఉద్యానహబ్‌గా రూపాంతరం చెందుతున్న కీలక తరుణంలో జిల్లాలో పండ్లతోటలు ముప్పుబారిన పడుతున్నాయి. నెలల తరబడి వర్షాలు లేక బోరుబావులు ఎండుముఖం పట్టాయి. కొత్తగా బోర్లు తవ్విస్తున్నా 10 శాతం కూడా ఫలితం కనిపించడం లేదు. దీంతో రైతులు దిక్కులు చూస్తున్న పరిస్థితి నెలకొంది.
2.96 లక్షల ఎకరాల్లో తోటలు..
జిల్లాలో 2.96 లక్షల ఎకరాల భారీ విస్తీర్ణంలో ఉద్యాన తోటలు విస్తరించాయి. అత్యధికంగా చీనీ తోటలు 90 వేల ఎకరాలు, మామిడి 35 వేలు, అరటి 35 వేలు, టమాట 40 వేలు, దానిమ్మ 12 వేల ఎకరాలు.. ఇలా 31 మండలాల పరిధిలోనూ తోటలు విస్తరించాయి. ఏటా 30 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులు, రూ.15 వేల కోట్లకు పైగా టర్నోవర్ జరుగుతున్నట్లు ఉద్యానశాఖ లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు సర్కారు రైతులకు నీటి భద్రత కల్పించడంలో విఫలం కావడంతో కష్టాలు తప్పడం లేదు. రెండేళ్లుగా రైతులకు పరిహారం ఇవ్వలేదు. ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. తోటలు ఎండుతున్నా అటువైపు చూసే పరిస్థితి కనిపించడం లేదు. తోటలను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటి తడులు ఇస్తున్నా ఏ మూలకూ చాలడం లేదని రైతులు వాపోతున్నారు.
ఆదుకున్న జగన్..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అన్నదాతలను ఆదుకున్నారు. జిల్లాలో యల్లనూరు మండలంలోని కోమటికుంట్ల, గరుగుచింతలపల్లికి చెందిన చీనీ రైతులకే రూ. 1.70 కోట్ల పరిహారం అందించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఒక్కో రైతుకు రూ.4 లక్షల వరకు ఖాతాల్లో జమ చేయగా, ప్రస్తుత సర్కారు ఇప్పటికీ పైసా ఇవ్వకపోవడం గమనార్హం.
వర్షాలు లేక, బోర్లలో నీళ్లు రాక
ఎండుతున్న ఉద్యాన తోటలు
పంటలను కాపాడుకునేందుకు
రైతుల అష్టకష్టాలు
నీటి భద్రత కల్పించడంలో
చంద్రబాబు సర్కారు విఫలం
ఉన్న మూడు బోర్లలో నీళ్లు తగ్గిపోయాయి. కొత్తగా బోరు వేసినా అర ఇంచు కూడా పడలేదు. ట్యాంకర్లతో తడి ఇద్దామంటే భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక 5 ఎకరాల్లో 8 ఏళ్ల కిందట సాగు చేసిన 600 చీనీ చెట్లను ఇదిగో ఇలా పుట్లూరుకు చెందిన రైతు వై.వీరశేఖర్‌రెడ్డి జేసీబీ ద్వారా తొలగించేశాడు. గతంలో మూడు పంటలు తీసుకున్నానని, ప్రస్తుతం బోర్లలో నీళ్లు తగ్గిపోవడంతో ఈ దుస్థితి తలెత్తిందని వీరశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నష్టం వచ్చిందని చెప్పాడు. ఇంకా రెండు ఎకరాల్లో మూడేళ్ల చెట్లు ఉన్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే రెండు మూడు నెలల్లో వాటిని కూడా తొలగించాల్సి ఉంటుందంటూ నిట్టూర్చాడు.


