అమ్మో.. నిమ్మ! | - | Sakshi
Sakshi News home page

అమ్మో.. నిమ్మ!

Sep 11 2026 10:04 AM | Updated on Sep 11 2026 10:04 AM

రాయదుర్గం: ఎల్‌నినో ప్రభావంతో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలోనూ పెను మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో నిమ్మకాయల వినియోగం ఎక్కువైంది. సరైన వర్షాలు కురవకపోవడంతో నిమ్మకాయల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో నిమ్మకాయల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఒక్కో నిమ్మకాయ రూ.10, చిన్నవైతే రూ.20కి మూడు ఇస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బస్తా రూ.16 వేల వరకూ...

గతేడాది ఇదే సమయానికి 80 కిలోల నిమ్మ బస్తా రూ.4 వేల నుంచి 8 వేలు పలికింది. తాజాగా కాయల నాణ్యతబట్టి రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పైకి ఎగబాకింది. మార్కెట్లోకి ఆశించిన స్థాయిలో కాయలు రావడం లేదు. చిన్నవైన సరే కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తోంది.

కేవలం 640 ఎకరాల్లో మాత్రమే...

జిల్లాలో గార్లదిన్నె, పెద్దపప్పురు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో సుమారు 640 ఎకరాల్లో మాత్రమే నిమ్మసాగు చేపట్టారు. ప్రతి ఏటా నష్టాలు మూటకట్టుకుంటున్న రైతులకు ఈ ఏడా ధరలు కాస్త ఊరిస్తున్నా దిగుబడులు కొంపముంచాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన మార్కెట్లకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి నిమ్మ బస్తాల దిగుమతి జరుగుతుంది. అన్నీ చోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బోర్లలో నీరు అడుగంటి దిగుబడులు దెబ్బతిన్నాయి. ఈ నెల ఆఖరకు ఒక్కో నిమ్మకాయ రూ.20 పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు కిలో రూ.220 నుంచి రూ.250 వరకు పలుకుతున్నాయి.

ఆందోళనలో కూల్‌డ్రింక్‌ వ్యాపారులు

జిల్లా వ్యాప్తంగా 2,478 కి పైగా చిన్న, పెద్ద కూల్‌ డ్రింక్‌ దుకాణాలు వెలిశాయి. సోడ, నన్నారి ఇతర కూల్‌ డ్రింక్స్‌లోకి నిమ్మ రసం కలుపుతుంటారు. నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా పెరగడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో నిమ్మకాయ రూ.10 తో కొనుగోలు చేసి సోడా ఎలా అమ్ముకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.

మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు

ఒక్కో నిమ్మకాయ రూ.10

చిన్న వైతే రూ.20 కి మూడు

ఇబ్బందుల్లో వినియోగదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement