ఉరవకొండ/వజ్రకరూరు: కోర్టులో వాయిదా ముగించుకుని తిరిగి స్వగ్రామం వెళ్తున్న ముగ్గురిని మృత్యువు కబళించింది. కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన వారు విగత జీవులుగా మారడం విషాదం నింపింది. వివరాలు.. వజ్రకరూరు గ్రామానికి చెందిన కణేకల్లు జైనుల్లా (45), మహబూబ్‌బాషా (32), భగవాన్ మహ్మద్‌రఫీ (30)లు గురువారం ఉదయం టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంలో ఉరవకొండ కోర్టుకు కేసు వాయిదా నిమిత్తం వచ్చి సాయంత్రం తిరుగు ప్రయాణయ్యారు. ఉరవకొండ దాటగానే టీవీటవర్ సమీపంలో గుర్తు తెలియని వాహనం వీరిని బలంగా ఢీకొంది.వాహనానికి ఇరుక్కున్న ముగ్గురినీ అర కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలైన వారు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు.
దద్దరిల్లిన ఉరవకొండ ఆస్పత్రి..
మృతదేహాలను ఉరవకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. వారి రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం దద్దరిల్లింది. ఒకేసారి ముగ్గురి మరణంతో వారి స్వగ్రామం వజ్రకరూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఉరవకొండ వద్ద
ఘోర రోడ్డు ప్రమాదం
బైకును ఢీకొన్న
గుర్తు తెలియని వాహనం
ముగ్గురు వ్యక్తుల దుర్మరణం


