కూడేరు: మండల పరిధిలోని ఉదిరిపికొండకు చెందిన రైతు గొల్ల మల్లికార్జునకు చెందిన పొలంలో బుధవారం రాత్రి చీనీ చెట్లను నరికి వేశారు. గురువారం ఉదయం మల్లికార్జున పొలంలోకి వెళ్లగా చీనీ చెట్లు నరికి ఉండడాన్ని గుర్తించాడు. వెంటనే ఈ ఘటనపై రైతు కూడేరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతు మల్లికార్జున మాట్లాడుతూ తన పక్క పొలం రైతులు వెంకటేశులు, ఉమాపతిలే చెట్లు నరికి వేశారని తెలిపారు. తమ పొలాల పరిధిలో గాలి మర ఫ్యాన్ ఏర్పాటు అవుతోందన్నారు. వారిద్దరూ డబ్బుకు ఆశ పడి సర్వే చేయించామని, తన పొలంలో వారికి భూమి వస్తుందని బుధవారం దైర్జన్యంగా రాళ్లు పాతినట్లు పేర్కొన్నారు. ఆ రాళ్లను తొలగించాననే కోపంతోనే చెట్లు నరికి ఉంటారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.


