అగ్ని ప్రమాదంలో పశుగ్రాసం దగ్ధం | - | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో పశుగ్రాసం దగ్ధం

Sep 9 2026 12:23 AM | Updated on Sep 9 2026 12:23 AM

బెళుగుప్ప: మండల కేంద్రానికి చెందిన రైతు శివ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో అగ్ని ప్రమాదం జరిగింది. పశుగ్రాసంతో పాటు గృహోపకరణాలు, పశువుల షెడ్డు మంటల్లో కాలిపోయాయి. కళ్యాణదుర్గం అగ్నిమాపక స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ వసంతనాయక్‌, సిబ్బంది ఫైర్‌ ఇంజిన్‌తో ఘటనాస్థలికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను చుట్టుపక్కల గడ్డివాములకు విస్తరించకుండా ఫైర్‌ సిబ్బంది అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంతో రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు శివ పేర్కొన్నారు.

రైలు కింద పడి

యువతి ఆత్మహత్య

గుత్తి: పట్టణంలోని చెర్లోపల్లి కాలనీకి చెందిన మునిస్వామి కుమార్తె హేమ(20) కాల్వగడ్డ ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హేమ కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా నయం కాలేదు. ఇటీవల హేమకు పెళ్లి ఖాయమైంది. దసరాకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే ఘోరం జరిగిపోయిందని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మునిస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

డీఎస్సీ అవకతవకలపై

విచారణ జరపాలి

ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలో డీఎస్సీ నియామకాలు, ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తరిమెల గిరి, ఓతూరు పరమేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఒకవైపు అవకతవకలు జరగలేదని చెబుతూనే మరోవైపు కొంతమందిని అరెస్టు చేయడం, పలు ఘటనలపై విచారణకు ఆదేశించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎంపికై న అభ్యర్థుల విజయగాథలను మంత్రులు, ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం కంటే, అన్యాయానికి గురైన అభ్యర్థుల సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ఏళ్ల తరబడి చదువుతూ, లక్షల రూపాయలు ఖర్చు చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరిగితే వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. డీఎస్సీ, స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కాకినాడలో పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారిపై కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం దుర్మార్గమని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పేర్కొన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు

అంగన్‌వాడీ కేంద్రాల

బలోపేతమే లక్ష్యం

ఐసీడీఎస్‌ పీడీ సాజిదా బేగం

అనంతపురం సిటీ: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టినట్లు ఐసీడీఎస్‌ పీడీ సాజిదాబేగం తెలిపారు. ‘నా అంగన్‌వాడీ – నా బాధ్యత’ నినాదంతో అక్టోబర్‌ 8 వరకూ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రీయ పోషణ్‌ మహోత్సవాలను బుధవారం ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిధిలో రాష్ట్రీయ పోషణ్‌ మహోత్సవాలను నిర్వహించనున్నామన్నారు. పోషకాహారం, ఆరోగ్యం, తల్లులు, చిన్నారుల సంరక్షణతో పాటు బాలల సమగ్ర అభివృద్ధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ప్రధానంగా ఆహార వైవిధ్యం – తగినంత ప్రోటీన్‌, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాజా వేడి వంటకాల పంపిణీ, సమాజ భాగస్వామ్యం – జవాబుదారీతనం, పోషణ– చిన్నారుల ప్రాథమిక అభివృద్ధి, ప్రధానమంత్రి మాతృవందన యోజన అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో తల్లిదండ్రులు, తల్లుల కమిటీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కిశోర బాలికలు, కమ్యూనిటీ వలంటీర్లు, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement