గుంతకల్లు రూరల్: స్థానిక టీవీ స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంతకల్లు పట్టణానికి చెందిన జోహా అనే బాలిక తీవ్రంగా గాయపడింది. వివరాలు.. ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో నివాసం ఉంటున్న ఎస్‌కే రియాజ్ బాషా, నసీరున్సీసా దంపతుల కుమార్తె జోహ పట్టణంలోని సాయిబాబా స్కూల్‌లో 5వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం స్కూలు వదలగానే తండ్రి రియాజ్‌బాషా కుమార్తెను స్కూటీపై ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో టీవీ స్టేషన్ వద్ద మలుపు తిరగ్గానే ఎదురుగా వేగంగా వచ్చిన కంటైనర్ లారీ స్కూటీని ఢీకొంది. దీంతో తండ్రి,కుమార్తె పక్కకు పడిపోయారు. అదే సమయంలో కంటైనర్ లారీ టైరు బాలిక కుడికాలిపై వెళ్లడంతో ఛిద్రమైపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన రియాజ్‌బాషా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే ఇద్దరినీ గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం బాలికను అనంతపురం తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు.
స్థానికుల రాస్తారోకో
టీవీ స్టేషన్ సమీపంలో ఇటీవల నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ అక్కడ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆందోళనకు దిగారు. నిత్యం భారీ వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డులో ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, ప్రమాదంలో గాయపడిన బాలిక కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ స్థానికులకు సర్దిచెప్పడంతో వారు శాంతించారు.


