‘అనంత’ భళా.. ‘దుర్గం’ డీలా | - | Sakshi
Sakshi News home page

‘అనంత’ భళా.. ‘దుర్గం’ డీలా

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

ఫీజు వసూళ్లలో మిశ్రమ స్పందన

అనంతపురం అగ్రికల్చర్‌: మార్కెటింగ్‌శాఖ నిర్దేశించిన ఫీజు వసూళ్లలో మార్కెట్‌ కమిటీల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఐదు కమిటీలు లక్ష్యం దిశగా పయనిస్తుండగా మరో నాలుగు కమిటీలు లక్ష్యానికి ఆమడదూరంలో నడుస్తున్నాయి. ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉన్న 9 మార్కెట్‌ కమిటీలు, 15 సరిహద్దు చెక్‌పోస్టుల ద్వారా వివిధ రకాల ఫీజులు రూ.14.35 కోట్లు టార్గెట్‌ ఇవ్వగా, ఆగస్టు నెలాఖరుతో ముగిసిన ఐదు నెలల కాలంలో రూ.5.07 కోట్లకు పైగా వసూళ్లయ్యాయి. ఓవరాల్‌గా 35.37 శాతం సాధించాయి. ఇందులో అనంతపురం మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ.5.25 కోట్లు కాగా ఇప్పటికే 51 శాతంతో రూ.2.69 కోట్ల వసూళ్లతో దూకుడు కొనసాగిస్తోంది. ఆ తర్వాత శింగనమల రూ.1.32 కోట్లకు గానూ 36.24 శాతంతో రూ.47.84 లక్షల వసూళ్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. రూ.1.13 కోట్లకు గానూ 34.87 శాతంతో రూ.39.40 లక్షల వసూళ్లతో ఉరవకొండ మూడో స్థానంలో ఉంది. ఇక 32 శాతంతో రాప్తాడు, 32 శాతంతో కళ్యాణదుర్గం మార్కెట్‌ కమిటీలు ఫరవాలేదన్నట్లుగా పయనిస్తున్నాయి. ఎటుతిరిగి రూ.30 లక్షలకు గానూ కేవలం 11 శాతంతో రూ.3.42 లక్షల వసూళ్లతో గుత్తి మార్కెట్‌ కమిటీ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఇక 14 శాతంతో రాయదుర్గం, 23 శాతంతో గుంతకల్లు, 25 శాతం వసూళ్లతో తాడిపత్రి మార్కెట్‌ కమిటీల్లో కూడా నిరాశాజనకంగా ఫలితాలు వెల్లడయ్యాయి. పశువులు, జీవాల సంతలు, చీనీ, చింతపండు, ఎండుమిర్చి, ఇతర వ్యవసాయోత్పత్తుల క్రయ విక్రయాలు, గోదాముల అద్దెలు, ట్రేడర్ల లైసెన్సులు, రెన్యువల్స్‌, రవాణా తదితర వాటికి సంబంధించి ఫీజులు, సెస్‌ వసూళ్లలో లీకేజీలు, సిబ్బంది కొరత, ఇన్‌చార్జ్‌ల పాలన కారణంగా వసూళ్లకు కోత పడుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే మార్చిలోపు అన్ని కమిటీలు వంద శాతం లక్ష్యం సాధించడానికి చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్‌శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement