హక్కులను పోరాడి సాధించుకుంటాం | - | Sakshi
Sakshi News home page

హక్కులను పోరాడి సాధించుకుంటాం

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

అనంతపురం అర్బన్‌: ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను పోరాడి సాధించుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ ఆర్‌.ఎన్‌.దివాకర్‌రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌, ఆర్డీఓ కార్యాలయం, జిల్లా ఖజానా, తదితర శాఖల్లో ఉద్యోగులకు నాయకులు నల్లరిబ్బన్‌ను తగిలించారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ ఉద్యమం మొదటి దశలో భాగంగా ఈ నెల 5వ తేదీ వరకు ఉద్యోగులందరం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. అదే విధంగా ‘‘సీఎం సార్‌ మా డబ్బులు మాకు ఇవ్వండి’’ అంటూ వాట్సాప్‌ డీపీలు ఉంచుకున్నామన్నారు. పీఆర్‌సీని నియమించకపోవడం, మధ్యంతర భృతి ప్రకటించకపోవడం, ఐదు డీఏల పెండింగ్‌ పెట్టడం, అరియర్స్‌ చెల్లింపు ఊసెత్తకపోవడం ఉద్యోగులను, వారి హక్కులను, ప్రయోజనాలను విస్మరించడమేనని మండిపడ్డారు. కార్యక్రమంలో మహిళ విభాగం జిల్లా చైర్‌పర్సన్‌ సురేఖరావు, నాయకులు హరిప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

‘సర్‌’ గడుపు పొడిగింపు

అనంతపురం అర్బన్‌: ఓటర్ల జాబితా క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువును భారత ఎన్నికల సంఘం ఈ నెల 10 వరకు పొడిగించింది. అందిన క్లెయిమ్‌ల అభ్యంతరాలను అక్టోబరు 5వ తేదీలోగా పరిష్కరిస్తారు. ఓటర్ల తుది జాబితా అక్టోబరు 9న ప్రచురిస్తారు. ఈ వివరాలను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్‌ మంగళవారం వెల్లడించారు. షెడ్యూల్‌ పొడిగింపును ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. తొలి షెడ్యూల్‌ ప్రకారం క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ గత నెల 30తో ముగిసింది. ఆ రోజు వరకు ఓటరుగా నమోదుకు (ఫారం–6) 20,912 దరఖాస్తులు రాగా 3,628 పరిష్కరించారు. 17,284 పెండింగ్‌లో ఉంచారు. తొలగింపునకు (ఫారం–7) 2,48,877 దరఖాస్తులు రాగా.. అందులో 2,48,615 పరిష్కరించారు. 262 పెండింగ్‌ ఉన్నాయి. ఓటరు వివరాల్లో మార్పునకు (ఫారం –8) 16,881 దరఖాస్తులు రాగా 5,325 పరిష్కరించారు. 11,556 పెండింగ్‌ ఉన్నాయి.

వేతనాలు చెల్లిస్తేనే

సమ్మె విరమణ

అనంతపురం అర్బన్‌: సత్యసాయి నీటి సరఫరా ప్రాజెక్టు కార్మికులకు బకాయిపడిన ఐదు నెలల వేతనం చెల్లించే వరకు సమ్మె కొనసాగుతుందని కలెక్టర్‌ ఆనంద్‌కు సీఐటీయూ, వైఎస్సార్‌టీయూ నాయకులు స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలు, వేతన బకాయి అంశాలపై కలెక్టర్‌ మంగళవారం తన చాంబర్‌లో సీఐటీయూ నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి.. సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయాన్ని తెలియజేశారు. కార్మికులకు ఐదు నెలలుగా వేతనం అందకపోవడంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్యం, రోజువారీ ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారన్నారు. వేతనాల కోసం ప్రభుత్వం ఏటా రూ.35 కోట్లు బడ్జెట్‌లో కేటాయించేలా చూడాలన్నారు. డిమాండ్లపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందిస్తూ కార్మికుల వేతనాల కోసం అవసరమైన బడ్జెట్‌ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో విడుదలయ్యేలా ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు. నాయకులు మాట్లాడుతూ వేతనాలు చెల్లించిన వెంటనే సమ్మె విరమిస్తామని కలెక్టర్‌కు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గంగాధర్‌, మధు, పొన్నూరప్ప, నరేషన్‌, వైఎస్సార్‌టీయూ నాయకులు గోవిందు, సురేష్‌బాబు, జయప్రకాష్‌, వెంకటేష్‌, రాజారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement