సాంకేతిక విద్యా ప్రదాత | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక విద్యా ప్రదాత

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు సువర్ణ యుగం

ఉచిత విద్యుత్‌ అమలు, కరెంటు బకాయిల రద్దుతో వ్యవసాయానికి ఊపిరి

సంక్షేమం.. అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాలకూ మేలు చేకూర్చిన వైనం

నేడు వైఎస్సార్‌ వర్ధంతి .. జిల్లా అంతటా సేవా కార్యక్రమాలకు శ్రీకారం

విద్యా కేంద్రంగా మడకశిర

మడకశిర: వైఎస్సార్‌ హయాంలో మడకశిరను విద్యా కేంద్రంగా మార్చారు. రాష్ట్రస్థాయి వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత రూపురేఖలను మార్చివేశారు. అలాగే వెటర్నరీ, హార్టికల్చర్‌, వ్యవసాయ పాలిటెక్నక్‌ కళాశాలలను కూడా ఏర్పాటు చేసి విద్యాప్రదాతగా నిలిచారు. ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, జనరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలను కూడా ఏర్పాటు చేసి మడకశిర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.

సాగు, తాగునీటికి భరోసా

మడకశిర నియోజకవర్గంలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం వైఎస్సార్‌ హయాంలో దాదాపుగా 80 శాతం పనులను పూర్తి చేశారు. మడకశిరకు కృష్ణా జలాలు వస్తున్నాయంటే వైఎస్సార్‌ చూపిన చొరవే కారణం. వైఎస్సార్‌ హయాంలోనే పీఏబీఆర్‌ (శ్రీరామరెడ్డి తాగునీటి పథకం) తాగునీటి పథకం ప్రారంభమైంది. దాదాపు రూ.600 కోట్లతో ఈపథకాన్ని పూర్తి చేసి మడకశిర నియోజకవర్గానికి ఫ్లోరైడ్‌ రహిత తాగునీటిని అందించారు.

రూ.2,500 కోట్ల అభివృద్ధి పనులు

మడకశిర నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో వైఎస్సార్‌ హయాంలో దాదాపు 30 వేల పక్కా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. ఆయన హయాంలో వందలాది కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. వైఎస్సార్‌ హయాంలో మడకశిర నియోజకవర్గంలో దాదాపు రూ.2,500 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి.

అనంతపురం అగ్రికల్చర్‌: అది 1993 – 2004 మధ్య కాలం. ప్రకృతి కన్నెర్రజేసింది. వరుస కరువులు ఉమ్మడి అనంతపురం జిల్లాను అతలాకుతలం చేశాయి. పంటలు దెబ్బతిని.. పెట్టుబడులు తిరిగి రాలేదు. రైతు ఇంట అప్పులు కుప్పలుగా పెరిగిపోయాయి. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ పోషణ భారమై.. పొట్ట చేత పట్టుకుని వలసబాట పట్టారు. అప్పులు తీర్చలేక.. ఆత్మాభిమానం చంపుకోలేక వందలాదిమంది రైతులు అర్ధంతరంగా తనువు చాలించారు. ఆదుకోవాల్సిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాంటి సమయంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. 2004లో వైఎస్సార్‌ అధికారంలోకి రాగానే రైతులతో పాటు అన్ని వర్గాలకూ నేనున్నానంటూ సంక్షేమ పథకాలు, రాయితీలతో భరోసా కల్పించారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సువర్ణయుగాన్ని మరిపించేలా పాలన సాగిస్తున్న క్రమంలో 2009 సెప్టెంబర్‌ 2న ఆయన హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన చేసిన మేలును ప్రజలు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు. నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లా అంతటా సేవా కార్యక్రమాలతో ఆయనకు నివాళులర్పించనున్నారు.

ఉచిత విద్యుత్‌తో వ్యవసాయానికి జీవం

వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే ఉచిత విద్యుత్‌ అమలుతో పాటు విద్యుత్‌ బిల్లుల మాఫీ ఫైలుపై తొలిసంతకం చేసి.. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయానికి జీవం పోశారు. ఈ క్రమంలో జిల్లా రైతులకు రూ.70.65 కోట్ల విద్యుత్‌ బకాయిలు మాఫీ అయ్యాయి. అలా ఐదేళ్లూ 1.75 లక్షల వ్యవసాయ మోటార్లకు రూ.వందల కోట్లు విలువ చేసే కరెంటు ఉచితంగా సరఫరా చేశారు. అంతకు మునుపు చంద్రబాబు హయాంలో విద్యుత్‌ బిల్లులు కట్టాలంటూ అర్థరాత్రి వెళ్లి మోటార్లు, స్టార్టర్లు ఎత్తుకెళ్లారు. ఎంతో మంది రైతులపై కేసులు పెట్టి వేధించారు. వైఎస్‌ రాకతో వ్యవసాయానికి సువర్ణయుగం మొదలైంది. అలాగే ఖరీఫ్‌లో 2004కు ముందు రూ.1,200 కోట్లు ఉన్న పంట రుణాలను ఐదేళ్లలో రూ.6,594 కోట్లకు చేర్చారు. పావలా వడ్డీ కింద రూ.44 కోట్లు ఇచ్చారు.

బీమాతో రైతన్నకు భరోసా..

చంద్రబాబు హయాంలో అమలవుతున్న పంటల బీమా పథకం రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఆ పథకాన్ని రైతులకు మేలు జరిగేలా మార్పులు చేసి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎనలేని భరోసా కల్పించారు. 2004–2009 మధ్య వైఎస్‌ హయాంలో పంటకోత ఫలితాల ఆధారంగా వేరుశనగకు బీమా కింద కింద ఏకంగా రూ.1,138 కోట్ల పరిహారం ఇచ్చారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.100 కోట్లు ఇచ్చారు.

వైఎస్‌ మార్క్‌ రుణమాఫీ

వైఎస్‌ హయాంకు సంబంధించి 2008లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నందున కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం 3,03,937 మంది రైతులకు చెందిన రూ.554.92 కోట్ల రుణాలు ఒకేవిడతలో మాఫీ చేశారు. అప్పటికే బ్యాంకులకు రుణాలు చెల్లించిన రైతులను గౌరవిస్తూ వారికి కూడా ప్రోత్సాహకాల కింద 3,61,269 మందికి రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. మొత్తమ్మీద వైఎస్‌ మార్క్‌ రుణమాఫీ, ప్రోత్సాహకాల కింద ఒకే విడతగా 6,65,206 మంది రైతులకు రూ.625 కోట్ల లబ్ధి చేకూర్చారు.

విత్తుకు రాయితీ

ఏటా ఖరీఫ్‌, రబీలో జిల్లాలోని రైతులకు లక్షల క్వింటాళ్లు వేరుశనగ, పప్పుశనగ, కంది, ఇతర విత్తనాలు రాయితీతో ఇచ్చారు. అలా వైఎస్‌ 2004– 2009 వరకు ఆరేళ్ల కాలంలో 28,05,901 మంది రైతులకు రూ.280.88 కోట్ల రాయితీతో 26,02,717 క్వింటాళ్లు వేరుశనగ పంపిణీ చేశారు. కంది, ఆముదం లాంటి ఇతర విత్తనాల కోసం మరో రూ.80 కోట్లు ఖర్చు రాయితీ ఇచ్చారు.

పండ్లతోటలు, సూక్ష్మసాగుకు ప్రోత్సాహం

వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్లతోటలు, డ్రిప్‌, స్ప్రింక్లర్ల రైతులకు కూడా చేయూతను అందించడంతో ఈ రంగాలు కూడా గాడినపడ్డాయి. రూ.25 కోట్లు రాయితీ ఇచ్చి పశుక్రాంతి, జీవక్రాంతి కింద 50 శాతం రాయితీతో మేలుజాతి పశువులు, గేదెలు అందజేసి క్షీరవిప్లవానికి నాంది పలికారు. 40 వేల హెక్టార్లలో కొత్తగా పండ్లతోటల విస్తరణకు రూ.80 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. దీంతో అప్పట్లోనే ‘ఫ్రూట్‌బౌల్‌ ఆఫ్‌ ఏపీ’గా పేరొచ్చింది. బిందు, తుంపర (డ్రిప్‌, స్ప్రింక్లర్లు) ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో రూ.280 కోట్లు రాయితీ ఇవ్వడంతో అప్పట్లోనే 1.13 లక్షల హెక్టార్లకు సూక్ష్మసాగు విస్తరించింది. వీటితో పాటు జలయజ్ఞం కింద పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడంతో అన్నదాతకు ఈ ఐదేళ్లూ వ్యవసాయం పండుగలా సాగింది.

అనంతపురం: కరువు సీమలో అనంతపురం జేఎన్‌టీయూను దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కల్పతరువుగా తీర్చిదిద్దారు. 2008 ఆగస్టు 18న జేఎన్‌టీయూ (ఏ)కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ యూనివర్సిటీగా మార్పు చేశారు. అనంతపురం లాంటి వెనుకబడిన జిల్లాలో సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో యూనివర్సిటీ 98 ఇంజినీరింగ్‌ కళాశాలలు, 33 ఫార్మసీ కళాశాలలు ఉండేవి. ఏటా లక్ష మంది విద్యార్థులు అభ్యసించేవారు. 2007–08 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్‌, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్సీ అగ్రికల్చర్‌ వంటి కోర్సులను నిరుపేద విద్యార్థులకు చేరువ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో లబ్దిపొందిన అనేక మంది నేడు ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement