● తేల్చి చెప్పిన ఆర్థిక మంత్రి కేశవ్
● ఆరుతడి కింద 40 వేల ఎకరాలకు సాగునీరు
● రాయదుర్గం, ఉరవకొండకు పెద్దపీట.. మిగతా నియోజకవర్గాలకు మొండిచేయి
అనంతపురం అర్బన్: సాగునీటిపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురయ్యింది. తాగునీటికే ప్రాధాన్యత... వరి, మిర్చి సాగుకు నీరివ్వలేం అంటూ మొదటి నుంచి అధికారులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వరికి నీరివ్వలేం అనే విషయాన్ని సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం వేదికగా స్పష్టం చేశారు. ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. అయితే ఆరుతడి పంటల సాగుకు నీటిని కేటాయించే విషయంలో వివక్ష కనిపించింది. ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, మంత్రి కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగునీటిని కేటాయించారు. ఇతర నియోజకవర్గాలకు మొండిచేయి చూపారు. సాగునీటి సలహా మండలి చైర్మన్, కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఐఏబీ సమావేశం నిర్వహించారు. మంత్రి, చీఫ్‌విప్‌తో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, జేసీ అస్మిత్‌రెడ్డి, బండారు శ్రావణిశ్రీ, దగ్గుపాటి ప్రసాద్ మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశానికి అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలి. జిల్లాకు చెందిన ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారంతా గైర్హాజరయ్యారు.
నికర జలాల లభ్యత 10.323 టీఎంసీలు
జిల్లాకు తుంగభద్ర డ్యాం నుంచి నీటి కేటాయింపు 16.097 టీఎంసీలు. ఇందులో జలాశయ, ప్రవాహ, ఇతర నష్టాలు 5.774 టీఎంసీలుగా అంచనా వేశారు. నష్టాలు పోగా నికర జలాల లభ్యత 10.323 టీఎంసీలుగా అంచనా వేశారు. ఇందులో తాగునీటి అవసరాలకు 5.130 టీఎంసీలు, సాగునీటి అవసరాలకు 5.193 టీఎంసీలు కేటాయించారు. వచ్చే ఏడాది జూలై 31 వరకు తాగునీటికే ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు నీటి కేటాయింపుపై స్పష్టత వచ్చిన తరువాత అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఆ రెండు నియోజకవర్గాలకే...
ఆరుతడి ఆయకట్టుకు సాగునీటిని రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాలకు మాత్రమే కేటాయించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఆరుతడి ఆయకట్టుకు సాగునీటికి కేటాయించలేదు.
● రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి టీడీ డ్యామ్ నుంచి హైలెవల్ ప్రధాన కాలువకు మొత్తం కేటాయింపు 1.824 టీఎంసీలు ఉండగా.. దామాషా ప్రకారం నికరంగా 1.170 కేటాయించారు. ఈ కాలువ కింద తడి 28,488 ఎకరాలు, ఆరుతడి 7,053 ఎకరాలు మొత్తం 35,541 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇందులో ఆరుతడి కింద 28 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని కేటాయించారు.
● ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి టీబీ డ్యామ్ నుంచి గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, గుత్తి సబ్ బ్రాంచ్ కెనాల్, ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు కేటాయింపు 1.716 టీఎంసీలు ఉండగా దామాషా ప్రకారం గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, గుత్తి సబ్ బ్రాంచ్ కెనాల్‌కు 0.722 టీఎంసీలు కేటాయించారు. ఈ కాలువల కింద ఆయకట్టు తడి 10,447 ఎకరాలు, ఆరుతడి ఆయకట్టు 21,616 ఎకరాలు ఉంది. ఇందులో ఆరుతడి 12 వేల ఎకరాలు ఆయకట్టుకు నీటిని కేటాయించారు.
● మధ్య పెన్నార్ దక్షిణ కాలువ కింద శింగనమల నియోజకవర్గం పరిధిలో తడి, ఆరుతడి ఆయకట్టు 33,176 ఎకరాలు ఉంది. మధ్య పెన్నార్ ఉత్తర కాలువ కింద తడి, ఆరుతడి ఆయకట్టు 13,325 ఎకరాలు ఉంది. తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ కింద తడి, ఆరుతడి ఆయకట్టు 31,131 ఎకరాలు ఉంది. ఈ కాలువలకు నీటి కేటాయింపు చేసినప్పటికీ ఆరుతడి ఆయకట్టుకు నీటిని కేటాయించలేదు.


