దమ్ముంటే రారా చూసుకుందాం! | TDP Leader Gangaram Fire On MLA Daggubati Prasad | Sakshi
Sakshi News home page

దమ్ముంటే రారా చూసుకుందాం!

Sep 2 2026 8:03 AM | Updated on Sep 2 2026 8:08 AM

TDP Leader Gangaram Fire On MLA Daggubati Prasad

‘‘నేను నీపేరు వాడుకున్నానా...నీ బతుక్కి అనంతపురంలో పార్టీ కార్యాలయం పెట్టే పరిస్థితి లేకపోతే నా ఇళ్లు ఇచ్చా. నీ కోసం కేసులు మోసుకున్నా..జైలుకు వెళ్లా...ఇంత చేస్తే...నన్ను వాడు...వీడు అంటావా...దమ్ముంటే రారా చూసుకుందాం’’ అంటూ అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌పై అతని నమ్మినబంటు, వరుసకు మామ అయిన గంగారాం రెచ్చిపోయారు. మంగళవారం రాత్రి టీడీపీ నియోజకవర్గ స్థాయి కార్యాలయంలో గంగారాం తన అనుచరులతో హల్‌చల్‌ చేసినట్లు తెలిసింది. ఏకంగా ఎమ్మెల్యే దగ్గుపాటిని ఉద్దేశించి బండబూతులు తిట్టినట్లు సమాచారం. ‘‘ఆ్రఫ్టాల్‌ ఎంపీపీవి.. ఎమ్మెల్యే స్థాయికి రావడానికి నేనే కారణం’’ అంటూ గంగారాం బాహాటంగానే విమర్శించినట్లు టీడీపీ వర్గాల్లో భారీగా చర్చ నడుస్తోంది.  

అసలు వివాదం ఏమిటంటే 
ఇటీవల బెంగళూరులో ఓ సామాజికవర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న నగరానికి చెందిన టీడీపీ నేత ఒకరు...‘‘ గంగారాంను వాడుకుని జైలు పాలు చేశావు కదయ్యా’’ అని అన్నారు. దీంతో సహనం కోల్పోయిన దగ్గుపాటి ప్రసాద్‌ అందరిముందే గంగారామ్‌ను బండబూతులు తిట్టినట్లు చర్చ జరుగుతోంది. ‘‘గంగారాం ఎంత అతని బతుకెంత... నా పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడతాడా‘‘ అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి రెచ్చిపోయినట్లు సమాచారం. ఈ విషయం అక్కడున్న వారి ద్వారా తెలుసుకున్న గంగారామ్‌ తీవ్ర అవమాన భారానికి లోనయ్యారు. 

మంగళవారం రాత్రి ఎమ్మెల్యే పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఉన్నట్లు తెలిసి అనుచరులతో కలిసి అక్కడికే వెళ్లాడు. అయితే ఎమ్మె ల్యే పార్టీ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ గంగారామ్‌ వస్తున్నట్లు తెలిసి తాను లేనట్లు అనుచరులతో చెప్పించారు. దీంతో కోపోద్రిక్తుడైన గంగారామ్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి.. చేసిన మేలు మరచిపోయాడంటూ చిందులు తొక్కారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అప్పటికప్పుడు తన అనుచరులను పిలిపించి గంగారామ్‌పై ఫిర్యాదు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. 

అక్రమ వసూళ్లు...జైలు 
ఎమ్మెల్యే దగ్గుపాటికి నమ్మిన బంటుగా ఉన్న గంగారామ్‌.. నగరంలో విచ్చలవిడిగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. నగరంలో ఒక వైన్‌ షాప్‌లో వాటాలు ఇవ్వలేదని నిప్పు పెట్టిన ఘటనలో గంగారాం అరెస్ట్‌ అయ్యారు. ఎగ్జిబిషన్‌ నిర్వాహకుడిపైనా డబ్బులు ఇవ్వాలని బెదిరించిన ఘటనలోనూ గంగారాం ప్రధానంగా ఉన్నారు. గంగారాంను కరివేపాకులా తీసి పారేసిన ఎమ్మెల్యే వైఖరిపై భగ్గుమంటున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే.. గంగారాం వైఖరి టీడీపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా అనంతపురం నగరంలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటీవల ఏకంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి దగ్గుపాటి వైఖరిపై ప్రెస్‌మీట్‌ పెట్టి ఏకిపారేశాడు. దగ్గుపాటి రూ.200 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డాడు అంటూ ఆధారాలతో సహా అధిష్టానానికి ఇచ్చామంటూ పేర్కొనడంతో నగరంలో టీడీపీ కేడర్‌ ఆత్మరక్షణలో పడింది.  
-అనంతపురం 

చదవండి: ‘ఒరేయ్‌ మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్‌ రా.. రా కూల్‌డ్రింక్‌ తాగుదాం!’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement