బలిగోరుతున్న బెల్ట్‌షాపులు! | - | Sakshi
Sakshi News home page

బలిగోరుతున్న బెల్ట్‌షాపులు!

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

రాప్తాడు రూరల్‌: జాతీయ రహదారి–44పై మద్యం విక్రయాలు వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాప్తాడు మండల పరిధిలోని హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారి వెంట ఉన్న కొన్ని హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో అనధికారికంగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తూ మద్యం లూజుగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైవేపై ప్రయాణించే కొందరు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు.

హోటల్‌ కాదు.. మద్యం అడ్డా

హైవే వెంట ఉన్న కొన్ని హోటళ్లలో మద్యం లూజు విక్రయాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏ సమయంలో వెళ్లినా మద్యం అందుబాటులో ఉంటోందని, దీంతో ఆయా ప్రాంతాలు వాహనదారుల్లో మద్యం లభించే ప్రదేశాలుగా గుర్తింపు పొందుతున్నాయని చెబుతున్నారు. హోటళ్లలో భోజనం, విశ్రాంతి కోసం ఆగే కొందరు మద్యం సేవించి వెంటనే వాహనాలు నడపడం ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసు, ఎకై ్సజ్‌ అధికారుల దృష్టికి

రాప్తాడులో డీఎస్పీ, పోలీస్‌స్టేషన్‌ కార్యాలయాలకు సమీపంలోనే కొన్ని హోటళ్లలో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే రామినేపల్లి శివారు, టోల్‌గేట్‌ సమీపంలోనూ మద్యం అక్రమ విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇంత బహిరంగంగా విక్రయాలు జరుగుతున్నా అటు ఎకై ్సజ్‌ అధికారులు కాని, ఇటు పోలీసు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

క్వార్టర్‌పై రూ.40–50 అదనపు వసూలు?

బెల్ట్‌షాపుల్లో మద్యం బాటిళ్లను నిర్ణీత ధర కంటే అధికంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఒక్కో క్వార్టర్‌పై రూ.40 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అక్రమ మద్యం విక్రయాలు కొందరికి ఆదాయ వనరుగా మారుతుండగా.. మరోవైపు మద్యం సేవించే వారి కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. హైవే పక్కన మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, అనధికారికంగా మద్యం విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాప్తాడు మండల ప్రజలు కోరుతున్నారు.

ఇటీవల బుక్కచెర్ల నుంచి రాప్తాడుకు వస్తున్న దంపతుల కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, ఆమె భర్త గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

రాప్తాడులో ఇటీవల మరో యువకుడు బెల్టుషాపులో మద్యం సేవించిన అనంతరం మరో బాటిల్‌ తీసుకుని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లగానే బైకు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎలాగోలా అతను ప్రాణాపాయం నుంచి గట్టెక్కాడు.

జాతీయ రహదారి పక్కనే బెల్ట్‌షాపుల దందా

తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు

అధికారులు కఠిన చర్యలు

తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement