గట్టు.. భయపడేట్టు! | - | Sakshi
Sakshi News home page

గట్టు.. భయపడేట్టు!

Aug 24 2026 6:51 AM | Updated on Aug 24 2026 6:51 AM

కణేకల్లు: ఉమ్మడి అనంతపురం జిల్లాకు వరప్రదాయిని హెచ్చెల్సీ. ఒకప్పుడు పూర్తి సాగునీటి ప్రాజెక్టు అయిన కాలువ నేడు జిల్లా ప్రజల దాహం తీర్చే ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా కూడా పేరుగాంచింది. తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ(హెచ్చెల్సీ) ఆంధ్రా సరిహద్దు 105 కిలోమీటర్‌ వద్ద ప్రారంభమవుతుంది. కాలువకు అనుబంధంగా జీబీసీ, పీఏబీఆర్‌ లింక్‌ఛానల్‌తో పాటు మిడ్‌పెన్నార్‌ డ్యాం ఉన్నాయి. టీబీ డ్యాం నుంచి కేటాయించిన నీరు సకాలంలో రావాలంటే కాలువ గట్లు పటిష్టంగా ఉండాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా మారింది. ఇటీవల చాలా చోట్ల గట్లు బలహీనంగా మారడం ఆందోళన రేకెత్తిస్తోంది. కొద్దిపాటి నీటి ప్రవాహాన్ని కూడా గట్లు తట్టుకోలేకపోతుండడం గమనార్హం. 1,260 క్యూసెక్కుల నీటి ప్రవాహానికే తట్టుకోకపోతే 1,800 లేదా 2000 క్యూసెక్కుల నీరు డ్రా చేస్తే పరిస్థితేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

తరచూ లీకేజీలు..

హెచ్చెల్సీపై ఉన్న యూటీ (అండర్‌ టన్నెల్‌)లు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. తరచూ యూటీల వద్ద ఉన్న క్రాస్‌ లైనింగ్‌లలో పైపింగ్‌లు ఏర్పడుతున్నాయి. తుంబిగనూరు వద్ద 159/277 కిలోమీటర్‌ వద్ద ఉన్న యూటీ, బిదరకుంతం శివారులో 168 కిలోమీటర్‌ వద్ద ఉన్న యూటీ, యర్రగుంట వద్ద 136 కిమీ యూటీ, బొమ్మనహళ్‌ వద్ద 107 కి.మీ యూటీ, చెర్లోపల్లి వద్ద 119 కి.మీ యూటీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యూటీల వద్ద కాలువ గట్లు బలహీనంగా మారాయి. నిత్యం ఎక్కడో ఒక చోట నీళ్లు లీకేజీ అవుతుండడం గమనార్హం. ఇటీవల యర్రగుంట వద్ద పైపింగ్‌ పడటంతో అధికారులు బంకమట్టి, ఎర్రమట్టి వేసి కట్టడి చేశారు. 122 కిలోమీటర్‌ వద్ద కూడా హెచ్చెల్సీ గట్టుకు పైపింగ్‌ పడింది. గత ఏడాది తుంబిగనూరు యూటీ వద్ద పైపింగ్‌ పడటంతో ఇసుక బస్తాలతో బండింగ్‌ వేయడం గమనార్హం.

దుస్థితిలో బ్రిడ్జీలు..

తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువపై నిర్మించిన బ్రిడ్జిలు కూడా దుస్థితికి చేరుకున్నాయి. ప్రధానంగా మాల్యం గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జి, కణేకల్లులోని రామనగర్‌ వద్ద ఇన్‌ఫాల్‌ రెగ్యులేటర్‌ బ్రిడ్జితోపాటు 157.925 కి.మీ, 151 కి.మీ వద్ద ఉన్న బ్రిడ్జీలు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. వాటిపై రాకపోకలు సాగించే ప్రజలు ఏ క్షణాన ఎలాంటి ముప్పు వస్తోందోనని బిక్కుబిక్కుమనాల్సి వస్తోంది.

దృష్టి సారించాల్సిందే..

హెచ్చెల్సీలో అత్యవసర పనులు చాలా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం తగిన దృష్టి సారించడం లేదని రైతులు వాపోతున్నారు. గతేడాది 116 కిలోమీటర్‌ వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ బలహీనంగా మారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. క్రాస్‌ రెగ్యులేటర్‌ అత్యంత అవసరమైనా... ఈ పనులను సైతం ప్రభుత్వం చేయలేకపోయిందని రైతులు మండిపడుతున్నారు. ఇటీవల అధ్వాన స్థితిలో ఉన్న యూటీలు, స్ట్రక్చర్లను గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.

టీబీ డ్యాం నుంచి హెచ్చెల్సీకి నీరు విడుదల చేసి రెండు వారాలవుతోంది. ఈ వ్యవధిలోనే రెండు చోట్ల పైపింగ్‌ పడడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది అనేక సార్లు పైపింగ్‌లు పడినా చంద్రబాబు సర్కారు మేల్కోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నాసిరకంగా పనులు..

హెచ్చెల్సీ నిర్వహణ విషయంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే దుస్థితి తలెత్తుతోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. గతేడాది ఆధునికీకరణ పేరిట పలుచోట్ల యూటీ, స్ట్రక్చర్లు (బ్రిడ్జి), కాలువ లైనింగ్‌ పనులు చేశారు. పనులు చేజిక్కించుకున్న అధికార టీడీపీ నేతలు నాసిరకంగా చేపట్టారన్న విమర్శలు ఉన్నాయి. తూతూమంత్రంగా పనులు చేసి కోట్లాది రూపాయలు జేబుల్లో వేసుకున్నారని, అధికారులు కూడా మామూలుగా పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బలహీనంగా మారిన హెచ్చెల్సీ గట్లు

రెండువారాల వ్యవధిలో రెండుచోట్ల పైపింగ్‌

చంద్రబాబు సర్కారు నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement