కాగితాల్లోనే ‘ప్రత్యామ్నాయం’ | - | Sakshi
Sakshi News home page

కాగితాల్లోనే ‘ప్రత్యామ్నాయం’

Aug 24 2026 6:51 AM | Updated on Aug 24 2026 6:51 AM

అనంతపురం అగ్రికల్చర్‌: ఖరీఫ్‌లో ప్రధాన పంటల సాగు గడువు ముగిసి 15 రోజులవుతున్నా ప్రత్యామ్నాయం చూపడంలో చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న విత్తనాలను ప్రస్తుతం విత్తుకున్నా ఉపయోగం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూలై ఆఖరుతోనే అదను ముగిసిందని వెల్లడిస్తున్నారు.

ఉలవలు, కొర్రలకే పరిమితం!

1.40 లక్షల నుంచి 1.50 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయం చూపాల్సిన సర్కారు ఇంకా విత్తనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. మొదట 25 వేల క్వింటాళ్లు, తర్వాత 40 వేల క్వింటాళ్లు, తాజాగా 31 వేల క్వింటాళ్లతో చూపిన ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళికలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఏపీ సీడ్స్‌ ద్వారా విత్తన సేకరణ జరుగుతోందని చెబుతున్నా 10 నుంచి 12 మండలాలకు మాత్రమే 2 వేల క్వింటాళ్ల వరకు ఉలవలు, కొర్రలు సరఫరా చేసినట్లు తెలిసింది. ఉలవలు, పెసలు, అలసందలు, జొన్నలు, కొర్రలతో పాటు కందులు కూడా ప్రత్యామ్నాయం కింద పంపిణీ చేస్తామని ప్రకటించినా ఉలవలు, కొర్రలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రైతులకు పెనుసవాల్‌..

మొత్తంగా ఈ ఖరీఫ్‌లో కంది పంట లక్ష హెక్టార్లకు చేరుతుండగా మరో ప్రధానపంట వేరుశనగ 50 వేల హెక్టార్లకు పరిమితం కానున్నట్లు చెబుతున్నారు. పత్తి 25 వేల హెక్టార్లు, మొక్కజొన్న 12 వేల హెక్టార్లు, ఆముదం 9 వేల హెక్టార్లు, సజ్జ 2,200 హెక్టార్లలో సాగులోకి రాగా, వరి నాట్లు 6 వేల హెక్టార్ల వద్ద సాగుతున్నట్లు వెల్లడైంది. వర్షాభావం, సాగునీటి కొరత కారణంగా 22 వేల హెక్టార్లు అంచనా వేసిన వరి ఈ సారి 10 నుంచి 12 వేల హెక్టార్లకు పరిమితం కావొచ్చని తెలుస్తోంది. ఎల్‌–నినో తీవ్రరూపం దాల్చడంతో జూలై, ఆగస్టులో వర్షాభావం కారణంగా సాధారణం కన్నా 40 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్‌ కల్లోలమైంది. ప్రత్యా మ్నాయం కనుచూపు మేర కనిపించకపోవడంతో ఈ సారి కరువు కోరల నుంచి గట్టెక్కడం ‘అనంత’ రైతులకు పెనుసవాల్‌గా మారింది. మున్ముందు ఎదురయ్యే సమస్యలు, కష్టాలను తలచుకుని రైతులు బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

స్పష్టమైన వివరాలు కరువు

వ్యవసాయశాఖ సాగు లెక్కలు సేకరించడంలో విఫలమవుతూ వారం వారం ఇచ్చే నివేదికల్లో మాత్రం విస్తీర్ణం పెంచుతూ వస్తుండటం గమనార్హం. జూలై ఆఖరు నాటికి 3.43 లక్షల హెక్టార్లకు గానూ 40 శాతంతో 1.40 లక్షల హెక్టార్లు చూపించిన ఆ శాఖ అధికారులు... తాజాగా 55 శాతంతో 1.88 లక్షల విస్తీర్ణంలో పంటలు సాగు చేసినట్లు వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రేపో మాపో మరో 10 వేల హెక్టార్లు పెంచి చూపించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ప్రధాన పంటల సాగు ఎంత... ప్రత్యామ్నాయం ఎంతనే దానిపై స్పష్టమైన వివరాలు కరువయ్యాయి. అయితే, ఎంత పెంచినా, ఇంకా 40 శాతం విస్తీర్ణం బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి.

చంద్రబాబు సర్కారు మీనమేషాలు

పంట సాగు అంచనాల్లో

వ్యవసాయ శాఖ విఫలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement