జిల్లాలో డొక్కల కరువు ఛాయలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో డొక్కల కరువు ఛాయలు

Aug 24 2026 6:51 AM | Updated on Aug 24 2026 6:51 AM

అనంతపురం: ‘దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో ఉమ్మడి అనంత రెండో స్థానంలో ఉంది. గతంలో ఈ ప్రాంతంలో డొక్కల కరువు వచ్చింది. అలాంటి ఛాయలే నేడు మళ్లీ కనిపిస్తున్నాయి’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి అన్నారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌ చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్న చంద్రబాబు ముందు ఉమ్మడి జిల్లా రైతాంగాన్ని, పశువులను, పండ్ల తోటలను కాపాడాలని కోరారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు కరాళ నృత్యం చేస్తున్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన చెందారు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 55 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 45 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయని, తీవ్ర వర్షాభావంతో ఆ పంటలూ ఎండిపోతున్నాయని తెలిపారు. రైతులు, రైతు కూలీలు బెంగళూరుకు వలసలు వెళ్తున్నారన్నారు. రెండేళ్ల వ్యవధిలో 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయాలని తాము ఎన్ని దఫాలు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. ఉమ్మడి జిల్లాలో తాగు, సాగునీటితో పాటు పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉందన్నారు. ఏ గ్రామంలోనూ గడ్డివామి కూడా కనిపించని దుస్థితి నెలకొందన్నారు.

మీతో ఏమిటీ ప్రయోజనం?

ప్రభుత్వం ఎల్‌నినోపై ప్రచారం చేయడమే గానీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో విఫలమైందని ‘అనంత’ధ్వజమెత్తారు. శ్రీశైలం డ్యాంలో ప్రస్తుతం 167 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని, పరిస్థితి ఆశాజనకంగా ఉన్నా రాయలసీమకు తగినన్ని నీళ్లు తీసుకురావడంలో చంద్ర బాబు ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. టీబీ డ్యాం నుంచి జిల్లాకు 27 టీఎంసీలు రావాల్సి ఉంటే ఈ ఏడాది 16 టీఎంసీలు మాత్రమే అని చెబుతుండడం అన్యాయమన్నారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలున్నా రైతుల గురించి ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.

అసమర్థ ప్రభుత్వం..

రాయలసీమ పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ మాత్రం నీటిని తరలించుకుపోతుండడం చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పది రోజుల్లో నీళ్లు ఖాళీ అవుతాయన్నారు.‘గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా పోలవరం కుడి కాలువలోకి పంపి, ఆ నీటిని కృష్ణా డెల్టాకు, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీకి పంపుతామని, తద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా 27 టీఎంసీలు డ్రా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీశైలం నుంచి మళ్లీ కృష్ణా జలాలను అక్కడికి తీసుకెళ్తే రాయలసీమ పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఆరుతడి పంటలకు నీళ్లు అందిస్తున్నా జిల్లాలో మాత్రం పంటలు సాగు చేయొద్దని చెబుతుండడం బాధాకరమన్నారు. ఉద్యాన పంటలు ఎండిపోకుండా రక్షక తడులు అందించాలని డిమాండ్‌ చేశారు. వీబీజీరాంజీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని పశుగ్రాసం పెంచాలని కోరారు. రైతాంగ సమస్యలపై త్వరలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరా రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస రెడ్డి, క్రిస్టియన్‌ మైనార్టీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, సోషల్‌ మీడియా జిల్లా కార్యదర్శి కల్లు రమేష్‌ గౌడ్‌, యువజన విభాగం నగర ప్రధాన కార్యదర్శి మైను తదితరులు పాల్గొన్నారు.

రాయలసీమకు నీటిని తీసుకురావడంలో

చంద్రబాబు ప్రభుత్వం విఫలం

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నా నిష్ప్రయోజనం

200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే పైసా పరిహారమివ్వరా?

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

అనంత వెంకటరామి రెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement