పెద్దవడుగూరు: తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకృతి వనరులను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు పోతుండడంతో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కొన్ని రోజులుగా పెద్దవడుగూరు మండలం జి.వెంకటాంపల్లి సమీపంలోని నల్ల గుట్ట వద్ద నుంచి మట్టిని అక్రమంగా గుంతకల్లు, గుత్తి పట్టణాలకు ఇష్టారాజ్యంగా తరలించేస్తున్నారు. రాయల్టీ చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. టీడీపీ కార్యకర్తలు ఒకరికి మించి ఒకరు జేసీబీలు పెట్టుకుని టిప్పర్లలో మట్టిని తరలిస్తూ రూ. లక్షలు వెనకేసుకుంటున్నారు. స్థానికులు ఇదేమని ప్రశ్నిస్తే ఫేక్ అనుమతి పత్రాలు చూపిస్తూ బురిడీ కొడుతున్నారు. సామాన్యులు తమ అవసరాలకు మట్టి తోలుకుంటే పోలీసులకు పట్టిస్తూ బెదిరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై పెద్దవడుగూరు తహసీల్దార్ ఉషారాణిని వివరణ కోరగా, ఆమె స్పందించారు. మండలంలో ఎక్కడా మట్టి తవ్వి తరలించేందుకు అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. అనుమతులు తీసుకోకుండా మట్టి, ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


