ఉరవకొండ: వ్యవసాయ శాఖలో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న మల్టీపర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల (ఎంపీఈఓ)ను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి కోరారు. శుక్రవారం శాసన మండలిలో ప్రత్యేక నివేదన ద్వారా ఆయన మాట్లాడారు. వ్యవసాయశాఖలో ఎంతో ముఖ్య భూమిక పోషిస్తున్న ఎంపీఈఓలు చాలీచాలని జీతంతో పనిచేస్తున్నారన్నారు. పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటోందన్నారు. వారి జీతాలను పెంచడంతో పాటు ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని విన్నవించారు.
చెత్త ప్రాసెసింగ్‌కు
రూ.30 కోట్లు!
అనంతపురం క్రైం: స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0లో భాగంగా జిల్లాలోని నగర పాలక సంస్థతో పాటు గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం మున్సిపాలిటీల పరిధిలో తడి, పొడి చెత్త ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు రూ.30.55 కోట్ల నిధులను కేటాయించారు. ఈ పనులను అనంతపురానికి చెందిన ఎంఎస్ తిరుమల కన్స్‌స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించారు. ఈ ప్రాజెక్ట్ అంచనా విలువ రూ.30.70 కోట్లు కాగా టెండర్‌లో 0.5 శాతం తక్కువ ధరతో రూ.30.55 కోట్లకు పనులు అప్పగించారు. రోజుకు 209 టన్నుల తడి చెత్త, 171 టన్నుల పొడి చెత్తను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గుంతకల్లులో 80 టన్నులు, గుత్తిలో 30 టన్నులు, అనంతపురంలో 170 టన్నులు, తాడిపత్రిలో 50 టన్నులు, రాయదుర్గంలో 30 టన్నులు, కళ్యాణదుర్గంలో 20 టన్నుల చెత్త ప్రాసెసింగ్‌కు సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఈ పనులను మరో రెండు ప్రైవేట్ సంస్థలతో కలసి సంయుక్తంగా తిరుమల కన్‌స్ట్రక్షన్స్ చేపట్టనున్నట్లు సమాచారం.


