కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిదవ రోజైన శుక్రవారం స్వామివారు పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై ఊరేగుతూ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. లోకంలో పుట్టడం, పెరగడం, నశించడం అనే మూడు ప్రక్రియలు కాలాధీనాలు. ఆ కాల స్వరూపుడిని తానే అంటూ చాటి చెబుతూ స్వామివారు సూర్య, చంద్ర ప్రభలను అధిష్టించి దర్శనమిచ్చారు. సూర్య మండల మధ్యస్తుడైన శ్రీ మహా విష్ణువుకు నారాయణుడని పేరు. పగటికి సూర్యుడు రారాజైతే, రేయికి చంద్రుడు అధిపతి. సృష్టికి ఎంతో ముఖ్యమైన ఈ రేయింబవళ్లను శ్రీమహావిష్ణువు రెండు కళ్లుగా కలిగివుండి, వాటినే వాహనాలుగా మార్చుకుని సృష్టిలో సర్వమూ తానే అని చాటిచెబుతూ తిరువీధుల్లో దర్శనమిచ్చినట్లు అర్చక పండితులు తెలిపారు.
నేడు మోహినీ ఉత్సవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి శనివారం మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.


