నీటి ఎద్దడి తలెత్తకూడదు | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి తలెత్తకూడదు

Mar 7 2026 8:08 AM | Updated on Mar 7 2026 8:08 AM

అనంతపురం అర్బన్‌: వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకూడదని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. వేసవి కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్‌ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌డబ్ల్యూఎస్‌, జిల్లా పరిషత్‌, డీపీఓ శాఖలు ప్రణాళిక మేరకు అవసరమైన నిధులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మూడు, నాలుగు నెలలకు ఎంత తాగునీరు అవసరం అవుతుంది.. పీఏబీఆర్‌లో అవసరమైన మేరకు నీటి నిల్వ ఉందా.. అనే వివరాలను నివేదించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి ఫిర్యాదు అందిన 24 గంటల్లో పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా సమస్యలు ఉంటే పదిరోజులు ముందుగానే గుర్తించాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి బోర్‌వెల్స్‌ ఏర్పాటు, మరమ్మతులు చేపట్టాలన్నారు. అవసరమైతే జిల్లా మినరల్‌ ఫండ్‌ కింద నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో నీటి వాడకం సరిగ్గా లేదన్నారు. నీటి వినియోగంపై దృష్టిపెట్టాలన్నారు. పట్టణాల్లో రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్లు ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు. నీటి వినియోగానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సురేష్‌, జెడ్పీ సీఈఓ శివశంకర్‌, డీపీఓ నాగరాజునాయుడు, డ్వామా పీడీ సలీంబాషా, ప్రజారోగ్య శాఖ ప్రాంతీయ అధికారి రామ్మోహన్‌రెడ్డి, ఈఈ సూర్యనారాయణ, హెచ్చెల్సీ ఎస్‌ఈ సుధాకర్‌రావు, మైనర్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈ విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.

తాగునీటి సమస్యలపైకంట్రోల్‌ సెంటర్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: వేసవి కాలం ప్రారంభం కానుండడంతో జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజనాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా పంచాయతీ కార్యాలయం ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా సంబంధిత సమస్యలు ఎదురైతే ప్రజలు బి.మదన్‌ మోహన్‌ 95504 80972 నంబరులో సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదులు అందిన తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేసి, వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్నారు.

రేపు గురుకుల ప్రవేశ పరీక్ష

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లాలోని 16 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో (అంబేడ్కర్‌ గురుకులాలు) 6–10వ తరగతుల ప్రవేశాలకు ఈ నెల 8న పరీక్ష నిర్వహించనున్నట్లు గురుకులాల ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి కె.విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందుకు అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. 6, 7 తరగతుల ప్రవేశాలకు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు, 8, 9, 10 తరగతుల ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. కేటాయించిన పరీక్ష కేంద్రాల్లోనే పరీక్ష రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హాల్‌టికెట్లు https://apbragcet.apcfss.in వెబ్‌ సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఏవైనా సందేహాలుంటే హెల్ప్‌డెస్క్‌ నంబర్లు 99493 54106, 94409 49528, 90102 23222లో సంప్రదించాలని సూచించారు.

మొలకలచెరువులో

స్టాపింగ్‌కు అనుమతి

గుంతకల్లు: తిరుపతి – అంకోలా మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మొలకలచెరువు రైల్వేస్టేషన్‌లో ఒక్క నిమిషం స్టాపింగ్‌కు అనుమతులు ఇచ్చినట్లు రైల్వే డివిజన్‌ అధికారులు తెలిపారు. గుంతకల్లు డివిజన్‌ పరిధిలోని కదిరి– మదనపల్లి రోడ్డు సెక్షన్‌లో మొలకల చెరువుకు తిరుపతి – అంకోలా (07605) ఎక్స్‌ప్రెస్‌ రైలు మధ్యాహ్నం 2.49 గంటలకు చేరుకుంటుందన్నారు. అలాగే అంకోలా నుంచి తిరుపతి (07606) ఎక్స్‌ప్రెస్‌ రైలు అర్ధరాత్రి 02.34 గంటలకు చేరుతుందన్నారు. ఈ హాల్ట్‌ను వెంటనే అమల్లోకి తెచ్చినట్లు డివిజన్‌ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement