● జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
అనంతపురం టవర్‌క్లాక్: పేదల పాలిట పెన్నిధిలా ఉన్న ఆర్డీటీ సేవలు కొనసాగించాలంటే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ కోరారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని డీపీఆర్‌సీ భవన్‌లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన దిశా (జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్‌పర్స్‌న్ గిరిజమ్మ తోపాటు కలెక్టర్ ఆనంద్, సీఈఓ శివశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజమ్మ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థ చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు. అలాంటి సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రెన్యూవల్ కాకుండా ఇబ్బందులు పెట్టడం దారుణమన్నారు. ఆర్డీటీ సేవలు ఆగిపోతే.. ఆ సంస్థపై ఆధారపడి జీవించే కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదివరకే మంత్రి నారా లోకేష్ ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయించామని స్టేట్‌మెంట్లు ఇచ్చారని, కానీ ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదన్నారు. తక్షణమే మరోమారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రెన్యూవల్ చేయించాలన్నారు.
108 అంబులెన్స్ సేవలు మెరుగుపరచండి
సకాలంలో ఆస్పత్రుల్లో చేర్పించి ప్రాణాలు కాపాడే 108 అంబులెన్స్ సేవలను మెరుగుపరచాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 108 సర్వీసులు సకాలంలో రావడం లేదని, స్పందన సరిగా ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇకనైనా సేవల మెరుగుకు చర్యలు చేపట్టాలన్నారు.
బాల్య వివాహాల నియంత్రణలో నిర్లక్ష్యం
జిల్లాలో ఇటీవల బాల్య వివాహాలు నమోదవుతున్నాయని జెడ్పీ చైర్‌పర్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాల నియంత్రణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న వయసులోనే వివాహాలు జరగడం వల్ల బాలికలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారన్నారు. తక్షణం జిల్లాలో బాల్య వివాహాలు నియంత్రించాలని అధికారులకు సూచించారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఫిర్యాదులు
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం నాణ్యతలేని భోజనం పెడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని గిరిజమ్మ తెలిపారు. విద్యార్థుల పొట్టకొట్టి పాపాలు మూటకట్టుకోవద్దని హితవు పలికారు. తాజా కూరగాయలతో రుచికరంగా వంట వండి వడ్డించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లాలో వేసవిలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏప్రిల్ 1 నుంచి నూతన ఉపాధి హామీ పథకం కింద 100 నుంచి 125 పని దినాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


