సమ్మెలోకి ‘సహకార’ ఉద్యోగులు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్–సొసైటీ) ఉద్యోగులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారు. దీని కారణంగా సొసైటీల్లో కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. పంట రుణాలు, భూములపై వ్యక్తిగత రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల పంపిణీ ఆగిపోనున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో ఉన్న 110 సొసైటీ ఉద్యోగుల సమ్మె వల్ల డీసీసీబీ సేవలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబు పాలనలో పోరుబాట..
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నుంచి పీఏసీఎస్ ఉద్యోగులు డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టారు. 18 నెలలుగా దశల వారీ ఉద్యమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) కమిషనర్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లినా సానుకూల స్పందన కనిపించలేదు. దీంతో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సోమవారం నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వెళుతున్నారు. డీసీవో, డీసీసీబీ, ఆప్కాబ్ కమిషనర్ కార్యాలయాల వద్ద వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,060 సొసైటీల ఉద్యోగులు దాదాపు 9 వేల మంది రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ఎదుట 13 రోజుల పాటు వంటావార్పుతో పెద్ద ఎత్తున నిరసనతో పాటు ముట్టడి చేపట్టినా చలనం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మె నోటీసు ఇచ్చినట్లు సొసైటీ వర్గాలు తెలిపాయి. ఇక తమ సమస్యలకు పరిష్కారం లభించేదాకా ఎన్ని రోజులైనా నిరవధిక సమ్మెలో ఉంటామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
జీవో 36 అమలు చేయాలి..
ప్రధానంగా జీవో 36 అమలు చేయాలని, 2019, 2024 పీఆర్‌సీ ఇవ్వాలని, లేదంటే 50 శాతం తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రూ.2 లక్షల గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేయాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రిటైర్డు వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, లాభనష్టాలతో సంబంధం లేకుండా సంఘాల ఉద్యోగుల జీతాలు చెల్లించాలని, రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మెకు వెళుతున్నట్లు పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులు, అసోసియేట్ ప్రెసిడెంట్ పి.హనుమంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసులు, కోశాధికారి ఎం.హనుమంతరెడ్డి తదితరులు తెలిపారు.
నేటి నుంచి మూతపడనున్న సొసైటీలు
నిలిచిపోనున్న రైతు రుణాలు,
ఎరువుల పంపిణీ


