అప్పుల ఊబిలోకి నెట్టే బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

అప్పుల ఊబిలోకి నెట్టే బడ్జెట్‌

Feb 16 2026 7:47 AM | Updated on Feb 16 2026 7:47 AM

అప్పుల ఊబిలోకి నెట్టే బడ్జెట్‌

అప్పుల ఊబిలోకి నెట్టే బడ్జెట్‌

ఉరవకొండ: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టే విధంగా ఉందని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన అనంతపురంలోని తన స్వగృహంలో రాష్ట్ర బడ్జెట్‌పై మీడియాతో మాట్లాడారు. రూ.3.32 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌లో తాజాగా రూ.లక్ష కోట్ల వరకు అప్పులు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా తేటతెల్లం చేశారన్నారు. నిధులు ఎలా తెస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ద్రవ్యలోటు కూడా ఈస్థాయిలో ఎన్నడూ చూడలేదన్నారు. ఆర్థికవేత్తలు సైతం రాష్ట్ర బడ్జెట్‌ను చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారని, ఇది మరింత అప్పుల ఊబిలో నెట్టే బడ్జెట్‌గా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. ఆర్థిక మంత్రి కేశవ్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పచ్చి అబద్ధాలతో మభ్యపెట్టారన్నారు. గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ అంటున్న ప్రభుత్వం.. హర్టికల్చర్‌ రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారంటే రైతుల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ హామీలు అరకొరగా సాగుతున్నట్టే బడ్జెట్‌ కూడా అరకొరగానే అమలు జరుగుతుందన్నారు. ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, సూపర్‌ సిక్స్‌ హామీలు కూడా ప్రజల ఆలోచనల నుంచి తొలగించాలన్న భావనతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. విద్య, వైద్యంతో పాటు గ్రామీణ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. గత వైఎస్‌ జగన్‌ పాలనను విమర్శించడంతోనే చంద్రబాబు ప్రభుత్వానికి సమయం సరిపోతోందన్నారు. ఐదేళ్ల కాలంలో వైఎస్‌ జగన్‌ రూ.2.75లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఖాతాలకు నేరుగా అందించారని గుర్తు చేశారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచి ఆర్థికంగా వారిని బలోపేతం చేశారన్నారు. రైతులకు రైతు భరోసా, ఇన్సూరెన్స్‌ లాంటివి అందించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన మూడవ బడ్జెట్‌లో కూడా సూపర్‌ సిక్స్‌ హామీలకు మొండి చెయ్యి చూపిందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ

పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement