ప్రాణాంతక వ్యాధులను సకాలంలో గుర్తించండి
● ప్రయోగశాలల సిబ్బందికి పశుశాఖ జేడీ ప్రేమ్‌చంద్ ఆదేశం
అనంతపురం అగ్రికల్చర్: పశువుల్లో సంక్రమించే ఆంత్రాక్స్, లంబీస్కిన్, బర్డ్‌ఫ్లూ, స్వైన్‌ఫ్లూ, రేబీస్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, ఇతరత్రా వ్యాధులు ప్రబలకుండా ప్రాథమిక స్థాయిలో గుర్తించేలా ప్రయోగశాలల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక సాయినగర్‌లో ఉన్న పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (అనియల్ డిసీసెస్ డయోగ్నస్టిక్ ల్యాబ్–ఏడీడీఎల్)లో ఏడీ డాక్టర్ జి.రవిబాబు, వీఏఎస్ డాక్టర్ శ్రుతితో కలిసి ఉమ్మడి జిల్లా పరిధిలోని నియోజక వర్గ స్థాయి వెటర్నరీ ల్యాబ్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. పశువులు, జీవాలు, కోళ్లు, ఇతర మూగజీవాలకు వ్యాపించే వివిధ రకాల వ్యాధులు, వాటి నిర్ధారణకు సేకరించే రక్తం, పేడ, అవయవ నమూనాలు, వాటిని పరీక్షించే విధానం, వ్యాధిని ప్రాథమికంగా నిర్ధారించడం, తీసుకోవాల్సిన నివారణ చర్యలను వివరించారు. రక్తపరీక్షలు, బయోకెమికల్ పరీక్షలు, పాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆంత్రాక్స్ లాంటి బ్యాక్టీరియల్ ప్రాణాంతక, ప్రమాదకర వ్యాధులు, వైరల్ పరీక్షలపై ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. పశువులు, జీవాల్లో మరణాలు సంభవించకుండా రైతులు నష్టపోకుండా పకడ్భందీగా పనిచేయాలని ఆదేశించారు. ప్రయోగశాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించి పరికరాలు అందజేశారు. ఇంకా అవసరమైన సామగ్రికి సంబంధించి ప్రతిపాదనలు పంపాలని ఏడీకి సూచించారు.


