‘అనంత పాలధార’ పోస్టర్ల విడుదల
అనంతపురం అగ్రికల్చర్: ఈ నెల 7వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి వేదికగా నిర్వహిస్తున్న ‘అనంత పాలధార’ పోటీలను విజయవంతం చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులను జేసీ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పశుశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్‌తో కలసి అనంత పాలధార పోస్టర్లను ఆయన విడుదల చేసి, మాట్లాడారు. రాయలసీమలోనే తొలిసారిగా ఇలాంటి కార్యక్రమ నిర్వహణకు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. మెరుగైన పశుజాతుల పెంపకం, పాడి ఉత్పత్తి పెంపు, పాడి పోషణలో శాసీ్త్రయ పద్ధతులు పాటించడం, కృత్రిమ గర్భధారణ, పశు ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలపై పాడి రైతుల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో పాల దిగుబడి పోటీలు, లేగ దూడల ప్రదర్శన, గర్భకోశవ్యాధి శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో విజేతలను అభినందిస్తూ బహుమతులు కూడా అందజేస్తారని, ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొనేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పశుశాఖ డీడీలు రమేష్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, రత్నకుమార్, గోల్డ్స్‌మన్ పాల్గొన్నారు.


