‘రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచకాలు’
అనంతపురం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టిస్తోందని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి విమర్శించారు. అనంతపురంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యల్లనూరు జెడ్పీటీసీ భోగాతి ప్రతాపరెడ్డిపై టీడీపీ గూండాలు చేసిన దాడిని ఖండించారు. ఈ దాడి ముమ్మాటికీ రెడ్‌బుక్‌లో భాగంగానే జరిగిందన్నారు. శింగనమల నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయనేందుకు ఇదే గొప్ప ఉదాహరణ అన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే కొందరు టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ దాడులను ప్రోత్సహించడం బాధాకరమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కనుసన్నల్లోనే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులపై దాడు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రశ్నిస్తానన్న జనసేనానీ నోటికి తాళం వేసుకున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే.. డిప్యూటీ సీఎం పదవి పోతుందనే భయంతో పవన్‌కళ్యాణ్ ఉన్నారని ప్రజలందరూ విశ్వసిస్తున్నారన్నారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ లేకుండా చేసేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసేలా దాడులు సాగిస్తున్నారని ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.


