నిధులు జేబులోకి.. పనులు గాలికి
పుట్టపర్తి అర్బన్: బాబా శత జయంతి ఉత్సవాలకు పర్యాటక శాఖ ద్వారా రూ.10 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే ఈ నిధులు ఏ మేరకు అందిందీ పర్యాటక శాఖ అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీంతో మున్సిపాలిటీ, పుడా ఆధ్వర్యంలో రూ.4కోట్లకు పైగా నిధులతో పాటు పెద్ద మొత్తంలో భక్తులు అందించిన విరాళాలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ క్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భారీగా ఖర్చు చేసి ఉత్సవాలను విజయవంతం చేసింది. ఇవన్నీ ప్రభుత్వం ఖాతాలోకి వేసుకొని తామే ఉత్సవాలను గొప్పగా నిర్వహించామన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ బిల్డప్‌లిచ్చారు. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులు సేదతీరేలా చిత్రావతి నది ఒడ్డున సత్యసాయి పార్కు నిర్మాణానికి జోయాలుక్కాస్ యజమాని సుమారు రూ.1.20 కోట్లు విరాళమిచ్చి సహకరించారు. ఈ నిర్మాణ పనుల కాంట్రాక్టును టీడీపీ నాయకులు దక్కించుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చివరకు ఉత్సవాలు సమీపిస్తుండడంతో హడావుడిగా జోయాలుక్కాస్ యజమాని, తదితరులతో కలసి పార్కును ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ప్రారంబించారు.
నేటికీ అసంపూర్తిగానే..
శత జయంతి ఉత్సవాలు ముగిసి నెలకు పైగా కావస్తోంది. అయినా అభివృద్ధి పనులు అసంపూర్తిగానే మిగిలి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. పార్కుకు సంబంధించి వంద శాతం పనులు అయిపోయినట్లుగా టీడీపీ నేతలు రికార్డులు చూపి మున్సిపాలిటీకి అప్పగించి బిల్లులు చేసుకున్నారు. అనంతరం మిగులు పనులు, నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో నాటిన మొక్కలు నీరందక చనిపోయాయి. మరుగుదొడ్లు కాస్త పాత సామగ్రి భద్రపరిచే గదుల్లా మారిపోయాయి. పార్కులో ఏర్పాటు చేసిన రెండు ఫౌంటెన్లలో ఐదు మోటార్లకు అనుసంధానించిన కేబుల్‌ను దుండగులు అపహరించుకెళ్లడంతో అవి కాస్త దిష్టిబొమ్మల్లా మిగిలిపోయాయి. నీరు అందకపోవడంతో పార్కులో పచ్చదనం కరువైంది. ఫలితంగా జోయాలుక్కాస్ యజమాని అందించిన రూ.1.20 కోట్ల విరాళం నిష్ప్రయోజనంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణదశలోనే ఫుడ్‌కోర్టు..
పార్కు పక్కనే ఫుడ్ కోర్టు నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఇది నిర్మాణ దశలోనే ఉండిపోయింది. పనుల కోసం సమీకరించిన ఇటుకలు అక్కడే పడేశారు. దీనికి తోడు విరిగిన బండలు కూడా అక్కడే పడేయడంతో ఆ ప్రాంతంలో అపరిశుభ్రత తాండవిస్తోంది. నాసిరకం పనుల కారణంగా విద్యుత్ కేబుల్ ఎక్కడికక్కడ బయట పడింది. పిల్లలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వాటిని తాకితే ప్రమాదం చోటు చేసుకునే అవకాశముంది. పార్కు పక్కన ప్రధాన రోడ్డుపై భక్తులు నడవడానికి వేసిన టైల్స్ చాలా వరకూ పగిలి పోయాయి. నాసిరకం పనులతో పలువురు భక్తులు ఇచ్చిన విరాళాలను సైతం స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి.
ప్రపంచ దేశాల భక్తులు తమ ఆరాధ్యదైవంగా కొలిచే సత్యసాయి శత జయంతి ఉత్సవాలను సైతం టీడీపీ నేతలు తెలివిగా సొమ్ము చేసుకున్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సొంత ఖజానాకు మళ్లించి సొమ్ము చేసుకున్నారు. ఆనవాయితీగానే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భారీ ఖర్చుతో ఉత్సవాలను విజయవంతం చేసింది. ఇది జగమెరిగిన సత్యం.
శతజయంతి వేడుకల సందర్భంగా సత్యసాయి పార్కు ఏర్పాటుకు చర్యలు
పార్కులో అభివృద్ధి పనులకు
విరాళమిచ్చిన జోయాలుక్కాస్
హడావుడి పనులతో
మమ అనిపించిన టీడీపీ నాయకులు
నిర్వహణకు తిలోదకాలివ్వడంతో
ఎండిన మొక్కలు
బిల్లులు చేసుకుని పనిని అటకెక్కించిన వైనం
నిధులు జేబులోకి.. పనులు గాలికి
నిధులు జేబులోకి.. పనులు గాలికి


