జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణ
దారి మళ్లిన నిధులపై మరోసారి విచారణ
అనంతపురం అగ్రికల్చర్: పశు సంవర్ధక శాఖలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఆడిట్ బృందం మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేపట్టింది. రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన కె.సత్యనారాయణ, ఎం.చక్రధర్, ఎన్.గంగాశేఖర్‌తో కూడిన ముగ్గురు అధికారుల బృందం శుక్రవారం జేడీ చాంబర్‌లో 32 వరకు బ్యాంకు ఖాతాలు, అందులో జరిగిన లావాదేవీలు, వాటికి సంబంధించి బ్యాంకు స్టేట్‌మెంట్లు, దారి మళ్లిన సొమ్ముకు సంబంధించి ఏమైనా బిల్లులు, ఓచర్లు, రికార్డులు ఉన్నాయా లేదా అనేదానిపై దృష్టి సారించినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. శనివారం కూడా ఆడిట్ కొనసాగించనున్నారు. గత ఏడాది నవంబర్ 14, 15 తేదీల్లో చేపట్టిన ఆడిట్ ప్రకారం ఐదు ప్రధాన బ్యాంకులకు సంబంధించి 18 ఖాతాల ద్వారా రూ.1.03 కోట్లు అనుమతి లేకుండా బదలాయింపులు జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. వాటిని మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యలో డైరెక్టరేట్ ఆదేశాల మేరకు మూడు దఫాలుగా జిల్లా అధికారులు పంపిన మరికొన్ని రికార్డులు, వివరాలతో పోల్చిచూస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి సస్పెండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్‌ను కూడా ఆడిట్ అధికారులు పిలిపించి పూర్తిస్థాయి సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు. అక్రమ లావాదేవీలు, బదలాయింపులకు సంబంధించి అటు ఆడిట్ అధికారులు, ఇటు పశుశాఖ అధికారులు వివరాలు చెప్పడానికి నిరాకరించారు.


