ఆ ఉపాధ్యాయుడు మాకొద్దు
అనంతపురం సిటీ: బాధ్యతలు విస్మరించిన ఉపాధ్యాయుడు లింగమయ్యచౌదరిపై కుందుర్పి మండలం ఎస్.మల్లాపురం ప్రాథమిక పాఠశాల కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు తరచూ డుమ్మా కొడుతున్నారని, ఆయన నిర్వాకం వల్ల పిల్లలు చదువు సంధ్యలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఉపాధ్యాయుడు తమకు అవసరం లేదని శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. లింగమయ్యచౌదరి స్థానంలో మరొక ఉపాధ్యాయుడిని నియమించాలని వారు కోరారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఈఓ హామీ ఇచ్చారు. డీఈఓను కలిసిన వారిలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ బాలాజీ, కమిటీ సభ్యులు గోపాల్‌నాయక్, హనుమంతరాయుడు, దేవేంద్ర, చంద్రశేఖర్, రమేశ్, భరత్, బాలు ఉన్నారు.


