వాటర్‌షెడ్‌ పనుల్లో దోపిడీ | - | Sakshi
Sakshi News home page

వాటర్‌షెడ్‌ పనుల్లో దోపిడీ

Dec 17 2025 7:09 AM | Updated on Dec 17 2025 7:09 AM

వాటర్

వాటర్‌షెడ్‌ పనుల్లో దోపిడీ

రాప్తాడు రూరల్‌: దేశంలోనే అత్యల్ప వర్షపాదం నమోదయ్యే రెండో జిల్లాగా ఉన్న అనంతపురంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాటర్‌షెడ్‌ పథకం వరం లాంటిది. ప్రతి నీటి చుక్కా వృథా కాకుండా భూమిలో ఇంకేలా చేసి భూగర్భ జలాలు పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. ఇంతటి ప్రాధాన్యత కల్గిన పథకం నిర్వహణను కొందరు అధికార తెలుగుదేశం పార్టీ అండతో నీరుగారుస్తున్నారు. వీరికి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు తోడవడంతో అక్రమాలకు తెర లేపుతున్నారు. రాప్తాడు మండలం హంపాపురం వాటర్‌షెడ్‌ పరిధిలో తవ్విన డగౌట్‌ పాండ్ల (ఇంకుడు గుంతల) నిర్మాణాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎక్కడైనా పనులు చేసి బిల్లులు చేసుకోవడం పరిపాటి. అయితే ఇక్కడి పనులు పరిశీలిస్తే బిల్లుల కోసం మాత్రమే పనులు చేసినట్టు స్పష్టమవుతోంది. ఫలితంగా లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

చింతతోపు చిన్నబోయేలా..

హంపాపురం సమీపంలోని చింతతోపులో అన్ని చెట్లకూ కాయలు విరగ్గాస్తున్నాయి. అలాంటి చింతతోపే చిన్నబోయేలా చేశారు టీడీపీ నేతలు. ఒకటికాదు రెండు కాదు దాదాపు 30 చింత చెట్లను తొలగించి ఆరు డగౌట్‌ పాండ్లు నిర్మించారు. చాలావరకు తొలగించిన చింతచెట్లు కనిపించకుండా తవ్వినమట్టిని కప్పేశారు. చింతతోపులో పెద్దపెద్ద చెట్లను తొలగించడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చెరువులో ఇంకుడు గుంతలేంటి?

నీటి సరంక్షణ కోసం చెరువుల్లోనూ డగౌట్‌ పాండ్లు నిర్మించారు. హంపాపురం సమీపంలో ఉన్న రెండు చెరువుల్లోనూ 15 పాండ్ల దాకా నిర్మించినట్లు తెలిసింది. అలాగే హంపాపురం వాటర్‌షెడ్‌కు సంబంధం లేని జంగాలపల్లి చెరువులో సైతం 5 డగౌట్‌ పాండ్లు నిర్మించడం గమనార్హం. చెరువులో పూడిక తీయించే పనులు చేయొచ్చుకానీ చెరువులో గుంతలు ఎలా పెడతారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పైగా చెరువులో గుంతలు పెట్టిన దెబ్బకు రెండు ఆదాయాలు వచ్చి పడుతున్నాయి. ఒకటేమో డగౌట్‌పాండు బిల్లు కాగా.. మరొకటేమో ఇక్కడ గుంత తవ్వి తీసిన మట్టిని ఇటుకల తయారీ ఫ్యాక్టరీలకు విక్రయించి సొమ్ము చేసుకోవడం.

ఏపీడీ పరిశీలించారా?

సాధారణంగా వాటర్‌షెడ్‌ పరిధిలో జరిగిన పనులకు సంబంధించి బిల్లులు పెట్టేముందు డ్వామా అడిషనల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (ఏపీడీ) పరిశీలించి ఆమోదం తెలపాలి. మరి హంపాపురం వాటర్‌షెడ్‌ పరిధిలో జరిగిన డగౌట్‌పాండ్ల నిర్మాణాలను ఏపీడీ క్షేత్రస్థాయిలో పరిశీలించారా? లేదా? అనేది ఉన్నతాధికారులకే తెలియాలి.

బిల్లుల కోసం డగౌట్‌ పాండ్‌ పనులు

హంపాపురంలో వెలుగుచూసిన అక్రమాలు

చింతతోపులో చెట్లను తొలిగించి మరీ పాండ్ల నిర్మాణం

పరిధి దాటి జంగాలపల్లి చెరువులోనూ వెలసిన పాండ్లు

అక్రమాలకు తెరలేపిన అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు

చెట్లను తొలగించకూడదు

హంపాపురం వాటర్‌షెడ్‌ పరిధిలోని చింతవనంలోని చింతచెట్లను తొలగించి గుంతలు పెట్టిన సంగతి నా దృష్టికి రాలేదు. పాండ్లు నిర్మించే క్రమంలో ఏ ఒక్క చెట్టును కూడా తొలగించరాదు. కాపుకాసే చింతచెట్లను తొలగించి గుంతలు తవ్విన వైనంపై విచారణ చేయిస్తాం. క్షేత్రస్థాయిలో ఉండే టెక్నికల్‌ అధికారితో పాటు ఇతరులకు నోటీసులు ఇస్తాం.

– సలీంబాషా, పీడీ, డ్వామా

వాటర్‌షెడ్‌ పనుల్లో దోపిడీ1
1/3

వాటర్‌షెడ్‌ పనుల్లో దోపిడీ

వాటర్‌షెడ్‌ పనుల్లో దోపిడీ2
2/3

వాటర్‌షెడ్‌ పనుల్లో దోపిడీ

వాటర్‌షెడ్‌ పనుల్లో దోపిడీ3
3/3

వాటర్‌షెడ్‌ పనుల్లో దోపిడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement