వెంటాడుతున్న ‘పాపం’పేట అక్రమాలు
● వీఆర్‌ఓ రఘుయాదవ్‌కు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు
● కఠినమైన చర్యలు తప్పవా?
రాప్తాడు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అనంతపురం శివారులోని పాపంపేట భూ కబ్జా వ్యవహారంలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తప్పుడు పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసి అక్రమార్కులకు అండగా నిలబడడాన్ని కలెక్టర్ ఆనంద్ సీరియస్‌గా పరిగణించారు. ఈ క్రమంలో ఇప్పటికే మండల సర్వేయర్ రఘునాథ్, పాపంపేట వీఆర్‌ఓ రఘుయాదవ్ పాత్రపై విచారణ పూర్తయింది. మరోవైపు తన సంతకాన్ని రాచూరి వెంకటకిరణ్ అనే వ్యక్తి ఫోర్జరీ చేశారని వీఆర్‌ఓ వివరణ ఇచ్చారు. దీంతో ఆర్డీఓ కేశవనాయుడు అనంతపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రాచూరి వెంకటకిరణ్‌పై ఫిర్యాదు చేయగా.. క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆర్డీఓ నివేదిక ఆధారంగా రెండు రోజుల కిందట కలెక్టర్ ఆనంద్.. వీఆర్‌ఓ రఘుయాదవ్‌కు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు జారీ చేశారు. గతంలో చాలా సందర్భాల్లో వచ్చిన ఆరోపణలపై సస్పెన్షన్ వేటు వేసేవారు. కేవలం సస్పెన్షన్లతో భయం ఉండదని భావించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వీఆర్‌ఓ రఘుయాదవ్‌కు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు జారీ చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే వీఆర్‌ఓ మెడకు ఉచ్చు పూర్తిగా బిగుస్తున్నట్లు అర్థమవుతోంది.
ఎలా వెలుగులోకి వచ్చిందంటే..?
కొందరు ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరడంతో మండల సర్వేయర్ రఘునాథ్, వీఆర్‌ఓ రఘుయాదవ్‌లు జారీ చేసిన తప్పుడు పొజిషన్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగు చూసింది. వివిధ సర్వే నంబర్లలో 176.82 ఎకరాల్లో రాచూరి కుటుంబ సభ్యులు, వారిద్వారా జీపీఏ చేయించుకున్న వారి ఆధీనంలో ఉన్నట్లు మండల సర్వేయర్ పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఆరు సర్వే నంబర్లలో 29.96 ఎకరాల్లో రాచూరి వెంకటకిరణ్ అనుభవంలో ఉన్నాడంటూ 2024 ఆగస్టు 13న అప్పటి పాపంపేట వీఆర్‌ఓ రఘుయాదవ్ పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. వీరిద్దరూ ఇచ్చిన నివేదికల ఆధారంగానే అక్రమార్కులు మ్యుటేషన్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
బయటపడ్డాక.. బుకాయింపు
పొజిషన్ల సర్టిఫికెట్ల జారీ వ్యవహరం వెలుగులోకి వచ్చిన తర్వాత తన సంతకాలు ఫోర్జరీ చేశారని వీఆర్‌ఓ బుకాయిస్తున్నారు. దాదాపు ఏడాది కిందట సంతకాలు చేసినట్లు తెలిసినా.. ఇన్ని రోజులు మౌనంగా ఉండడానికి కారణం, కనీసం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన తప్పించుకునే అవకాశం లేదని చార్జెస్ నోటీసుకు ఏది జవాబు ఇచ్చినా ఇరుక్కోవడం తథ్యమని, కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా మసలుకునే విధంగా గుణపాఠం చెప్పాలని, తప్పుడు నివేదికలు ఇచ్చిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని పాపంపేట భూముల బాధితులు కోరుతున్నారు. కాగా మండల సర్వేయర్ రఘునాథ్‌కు కూడా చార్జెస్ నోటీసు జారీ చేస్తారని తెలిసింది.


