నేడు రాప్తాడుకు జగన్
● తోపుదుర్తి రాజశేఖరరెడ్డి కుమార్తె వివాహానికి హాజరుకానున్న మాజీ సీఎం
● లింగనపల్లి రోడ్డు వద్ద హె లిప్యాడ్
● ఏర్పాట్లను పర్యవేక్షించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
రాప్తాడు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రాప్తాడుకు రానున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి, తోపుదుర్తి నయనతారెడ్డి దంపతుల కుమార్తె మోక్షిత విష్ణుప్రియారెడ్డి, తేజేష్ రెడ్డిల వివాహం రాప్తాడులో జరగనుంది. ఇందుకోసం 44వ జాతీయ రహదారి హెచ్‌పీ పెట్రోలు బంక్ ఎదురుగా కల్యాణ వేదికను అద్భుతంగా సిద్ధం చేశారు. ఈ వివాహానికి వైఎస్ జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. బెంగళూరులో ఉదయం 10 గంటలకు యలహంక నుంచి బయల్దేరి 10.20 గంటలకు జక్కూరు ఏరోడ్రోమ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 11.30 గంటలకు రాప్తాడులోని లింగనపల్లి రోడ్డు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.40 గంటలకు రోడ్డు మార్గంలో బయల్దేరి 11.55కు కల్యాణమండపం చేరుకుంటారు. 12.15 గంటల వరకు పెళ్లి వేడుకల్లోనే ఉంటారు. మధ్యాహ్నం 12.30కు రాప్తాడు హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 1.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటారు. వివాహానికి హాజరయ్యే జగన్‌ను చూసేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. అందుకు తగిన సౌకర్యాలు, హెలిప్యాడ్ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పరిశీలించారు.


