సత్యసాయి మార్గం అనుసరణీయం
ప్రశాంతి నిలయం: సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవ సంబరం అంబరమంటింది. శనివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గౌరవ అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. తొలుత సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థుల బ్రాస్‌బ్యాండ్ నడుమ అతిథులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్, మేనేజ్‌మెంట్ కౌన్సిల్ సభ్యులు ప్రత్యేక వేదిక వద్దకు చేరుకున్నారు. యూనివర్సిటీ చాన్సలర్ చక్రవర్తి స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాఘవేంద్ర ప్రసాద్ ప్రారంభోపన్యాసం చేశారు. సత్యసాయి ఆశయాలు, బోధనలను అనుసరించి మానవతా విలువలు, శాస్త్రసాంకేతికతతో కూడిన ఆదర్శ విద్యను ఆధునిక గురుకుల విద్యావిధానం ద్వారా సత్యసాయి విద్యాసంస్థల్లో అందిస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామన్నారు.
సమసమాజ స్థాపన మీ వల్లే సాధ్యం!
‘సత్యసాయి విద్యాసంస్థలు మానవతా విలువలు, ఆధ్యాత్మికతతో కూడిన విద్యనందించడం గొప్ప విషయం. స్నాతకోత్సవంలో సత్యసాయి విద్యార్థులను చూస్తుంటే సమసమాజ స్థాపన మీ వల్ల సాధ్యమవుతుందన్న భావన కలుగుతోంది’ అని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. అందరూ సమానమని చెప్పే సత్యసాయి బోధనలను దేశ విదేశాలకు తీసుకెళ్లడానికి ఇక్కడి విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎదగాలన్నారు. శాస్త్రసాంకేతికత ఆధారంగా నూతన అవిష్కరణలవైపు దృష్టి సారించాలన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు.
వైభవంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపరాష్ట్రపతి
20 మందికి బంగారు పతకాలు, 14 మందికి డాక్టరేట్లు, 521 మందికి డిగ్రీల ప్రదానం
ప్రశాంతి నిలయం: ‘అందరినీ ప్రేమించు...అందరినీ సేవించు’ అని చెప్పడంతో పాటు పాటించిన సత్యసాయి మార్గం అందరికీ అనుసరణీయమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సత్యసాయి శతజయంతి వేడుకల్లో శనివారం ఆమె పాల్గొన్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి ముర్ము.. నేరుగా ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరానికి చేరుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.


