జాబ్ కార్డులు గల్లంతు!
● జిల్లా వ్యాప్తంగా 26 వేల ఉపాధి జాబ్‌కార్డుల తొలగింపు
● తొలగింపులో రాజకీయ కుట్ర
అనంతపురం టౌన్: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి పథకంలో పని చేస్తున్న శ్రామికుల జాబ్‌కార్డుల తొలగింపు పక్రియను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. శ్రామికులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా జాబ్‌కార్డుల తొలగింపుల పక్రియను చేపట్టింది. ఒక్క రాప్తాడు గ్రామంలోనే ఏకంగా 500కు పైగా జాబ్ కార్డులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం గమనార్హం. క్షేత్రస్థాయిలో ఉపాధి శ్రామికులతో చర్చించి వారి వివరణ తీసుకున్న తర్వాత జాబ్‌కార్డులను తొలగించాల్సి ఉండగా... ఇందుకు విరుద్ధంగా రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి ఇష్టానుసారంగా జాబ్ కార్డులను తొలగించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
జిల్లాలో 5.38 లక్షల మంది శ్రామికులు
జిల్లా వ్యాప్తంగా 3.16లక్షల జాబ్‌కార్డులు, 5.38లక్షల మంది ఉపాధి శ్రామికులు ఉన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉపాధి శామ్రికుల జాబ్‌కార్డుతో ఆధార్ అనుసంధానం, ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే అదనుగా ఉపాధి శ్రామికుల ప్రమేయం లేకుండానే జాబ్‌కార్డులను తొలగించేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 90 వేల మందిపై వేటు
జిల్లా వ్యాప్తంగా ఉపాధిహామి పథకంలో పని చేస్తున్న శ్రామికుల కుటుంబాలకు సంబంధించి 26 వేల జాబ్‌కార్డులను తొలగించారు. ఈ లెక్కన దాదాపు 90వేల మందికి పైగా శ్రామికుల జాబ్‌కార్డులు మాయమయ్యాయి. కొన్ని నెలలుగా ఉపాధి పనులకు రావడం లేదని? జాబ్‌కార్డు ఉన్న స్థానికంగా అందుబాటులో లేరంటూ మరి కొందరి జాబ్‌కార్డులను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రాజకీయ కుట్రలతోనే చాల మంది జాబ్‌కార్డులను కోల్పోవాల్సి వచ్చిందంటూ ఉపాధి శ్రామికులు వాపోతున్నారు.


