శత ఉత్సవం.. భక్తజన సంబరం
● నేడు సత్యసాయి శత జయంత్యుత్సవం
● ఏర్పాట్లు పూర్తి చేసిన సత్యసాయి ట్రస్ట్
● ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి
ప్రశాంతి నిలయం: భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న ప్రేమమూర్తి భగవాన్ సత్యసాయి శతజయంతి వచ్చేసింది. ఆదివారం హిల్‌వ్యూ స్టేడియంలో వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని ప్రత్యేక ఫల, పుష్ప దళాలతో తీర్చిదిద్దారు. ప్రశాంతి నిలయం విద్యుత్ కాంతుల నడుమ వెలిగిపోతోంది. వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరై భక్తులనుద్దేశించి ప్రసంగించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
వేడుకల నిర్వహణ ఇలా...
ప్రపంచ ఆధ్యాత్మిక గురు సత్యసాయి శతజయంతి వేడుకలు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్నాయి. హిల్‌వ్యూ స్టేడియంలో సత్యసాయి స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటలకు విద్యార్థుల వేదపఠనం, 9.40 గంటలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు ప్రారంభోపన్యాసం చేస్తారు. 9.50 గంటలకు తమిళనాడు బాలవికాస్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన, 9.55కు కర్ణాటక బాలవికాస్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన, 10 గంటలకు రాష్ట్ర మంత్రి నారాలోకేష్ ప్రసంగం, 10.05 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగం, 10.15కు ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం, 10.25గంటలకు ముఖ్య అతిథి భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రసంగం, సత్యసాయి జయంతి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు సత్యసాయి జోలోత్సవం నిర్వహిస్తారు. అనంతరం ది ఎటర్నల్ ‘సింపోనియం ఆఫ్ సెల్ఫ్‌లెస్ లవ్’ పేరుతో కచేరీ ఉంటుంది.


