
కంది జోరు.. వేరుశనగ బేజారు!
అనంతపురం అగ్రికల్చర్: అరకొర పదును.. అననుకూల వర్షాలు వెరసి ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగు అతికష్టమ్మీద ‘సాగు’తోంది. మునుపెన్నడూ లేని విధంగా నైరుతి రుతుపవనాలు ముందుగానే మురిపించినా కీలక సమయమైన జూన్, జూలైలో మొహం చాటేశాయి. జూన్‌లో సాధారణం కన్నా 21.7 శాతం తక్కువగానూ, కీలకమైన జూలైలో కూడా 46.4 శాతం తక్కువగా వర్షాలు పడటంతో ఖరీఫ్ మందకొడిగానే సాగింది. తీరా పంటలు విత్తుకునే గడువు ముగిసిన తర్వాత ఆగస్టు 5 నుంచి విస్తారంగా వర్షాలు కురిశాయి. జూన్ ఒకటి నుంచి ఆగస్టు 5 వరకు అంటే 65 రోజుల్లో 130 మి.మీ గానూ 37 శాతం తక్కువగా 82.7 మి.మీ వర్షం కురిసింది. ఆ తర్వాత ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 మధ్య 15 రోజుల్లోనే 40 మి.మీ గానూ ఏకంగా 150 మి.మీ వర్షపాతం నమోదైంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే 35 శాతం లోటున్న వర్షపాతం ఏకంగా 35 శాతం అధికంగా నమోదైంది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల మధ్య ఖరీఫ్ పంటల సాగు చేశారు. కరువు ఛాయలు కమ్మేశాయని ఆందోళన చెందుతున్న తరుణంలో వరుణుడు కరుణించాడు.
65 శాతం విస్తీర్ణంలో ఖరీఫ్..
ఈ ఖరీఫ్‌లో అన్ని పంటలు కలిపి 3,43,232 హెక్టార్లుగా అంచనా వేయగా... ఈనెల 26 నాటికి 65 శాతంతో 2.21 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చినట్లు వ్యవసాయశాఖ నివేదిక విడుదల చేసింది. వారం వారం వ్యవసాయశాఖ విడుదల చేస్తున్న సాగు గణాంకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొంచెం విస్తీర్ణం పెంచుతూ వస్తున్నారు. ఈ–క్రాప్ పూర్తయితే కాని సాగు లెక్కలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. తాజా నివేదిక పరిశీలిస్తే... జిల్లా చరిత్రలో తొలిసారిగా ప్రధానపంటగా దశాబ్ధాలుగా వెలుగొందుతున్న వేరుశనగ విస్తీర్ణం తగ్గిపోవడం గమనార్హం. 1.82 లక్షల హెక్టార్లు అంచనా వేయగా 72 వేల హెక్టార్లకు పరిమతమైంది. ఈ సారి వేరుశనగను అధిగమించి కంది పంట ఏకంగా 82,257 హెక్టార్లకు చేరుకోవడం విశేషం. ప్రధాన పంటల జాబితాలో ఉన్న పత్తి 44 వేల హెక్టార్లకు గానూ 21 వేల హెక్టార్ల వద్ద ఆగిపోయింది. ఆముదం కూడా 16,293 హెక్టార్లకు గానూ 10,400 హెక్టార్లకు పరిమితమైంది. మొక్కజొన్న పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. 14,653 హెక్టార్లకు గానూ 16,700 హెక్టార్లకు పెరిగింది. ఇటీవల వరి నాట్లు ఊపందుకోగా... 19,446 హెక్టార్లకు గానూ ప్రస్తుతానికి 14 వేల హెక్టార్ల వద్ద కొనసాగుతున్నాయి. మిగతా పంటల విషయానికి వస్తే... సజ్జ 3,300 హెక్టార్లు, కొర్ర 950 హెక్టార్లు, జొన్న 350 హెక్టార్లు, అలసంద 150 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 600 హెక్టార్లలో వేశారు.
‘ప్రత్యామ్నాయం’ చూపని కూటమి..
65 శాతం విస్తీర్ణంలో ఖరీఫ్ పంటలు సాగులోకి రాగా ఇంకా 35 శాతం అంటే 1.20 లక్షల హెక్టార్ల భూములు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఏ పంట వేసుకోవాలో రైతులకు అర్థం కావడం లేదు. ‘ప్రత్యామ్నాయం’ చూపడంలో కూటమి సర్కారు వేచిచూసే ధోరణి అవలంభిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినపుడు ఆగస్టు మూడో వారంలో ఉలవ, పెసర, అలసంద, కొర్ర, జొన్న లాంటి విత్తనాలను ప్రత్యామ్నాయం కింద పంపిణీ చేసేవారు. అయితే ఈ సారి ప్రత్యామ్నాయం చూపుతారా.. చేతులెత్తేస్తారా అనే విషయంపై అటు వ్యవసాయశాఖ ఇటు సర్కారు పెద్దలు స్పష్టత ఇవ్వడం లేదు.
ఖరీఫ్ సాగు @ 65 శాతం
తొలిసారి వేరుశనగను అధిగమించిన కంది
2.21 లక్షల హెక్టార్లలో సాగు
ఇంకా 1.20 లక్షల హెక్టార్లు బీడు
ప్రత్యామ్నాయంపై స్పష్టత ఇవ్వని కూటమి సర్కారు