తిరుపతి–కాచిగూడ మధ్య స్పెషల్‌ రైలు | - | Sakshi
Sakshi News home page

తిరుపతి–కాచిగూడ మధ్య స్పెషల్‌ రైలు

Aug 30 2025 8:00 AM | Updated on Aug 30 2025 8:00 AM

తిరుపతి–కాచిగూడ  మధ్య స్పెషల్‌ రైలు

తిరుపతి–కాచిగూడ మధ్య స్పెషల్‌ రైలు

గుంతకల్లు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 30న తిరుపతి–కాచిగూడ మధ్య స్పెషల్‌ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు శనివారం రాత్రి 9.10 గంటలకు తిరుపతి జంక్షన్‌ (02793)లో బయలుదేరి ఆదివారం ఉదయం 11 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్‌ చేరుతుందన్నారు. ప్రస్తుతం కాచిగూడ నుంచి తిరుపతికి (02792) ప్రత్యేక రైలు శుక్రవారం రాత్రి 11 గంటలకు బయలుదేరిందన్నారు. రైలు రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూరు, కృష్ణా, యాదగిరి, సేలం, తాండూరు, వికారాబాద్‌, లింగంపల్లి, సికింద్రాబాద్‌ మీదుగా ప్రయాణిస్తుందన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నేడు నూతన బార్లకు లాటరీ

అనంతపురం: నూతన బార్ల ఏర్పాటుకు శనివారం లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. జిల్లాలో కొత్తగా 19 బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 10 బార్లకు 40 దరఖాస్తులు రాగా.. 9 బార్లకు దరఖాస్తులు రాలేదు. గీత కులాలకు సంబంధించి రెండు బార్లకు నోటిఫికేషన్‌ రాగా, మొత్తం 10 దరఖాస్తులు వచ్చాయి. ఓపెన్‌ కేటగిరిలో 10, గీత కులాలకు సంబంధించి రెండు బార్లకు శనివారం లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. జెడ్పీలో శనివారం ఉదయం 8 గంటలకు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు. కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో లాటరీ చేపడుతున్నట్లు వెల్లడించారు.

పీఆర్‌ ఎస్‌ఈగా చిన్న సుబ్బరాయుడు

అనంతపురం సిటీ: జిల్లా పంచాయతీరాజ్‌ సర్కిల్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఈ)గా వై.చిన్న సుబ్బరాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు జిల్లాలో పని చేస్తున్న చిన్న సుబ్బరాయుడుకు పదోన్నతి కల్పించి అనంతపురం సర్కిల్‌ కార్యాలయ ఎస్‌ఈగా నియమించారు.

దళితులను

చితకబాదిన పోలీసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా

చెన్నంపల్లిలో ఓవరాక్షన్‌

బుక్కరాయ సముద్రం: వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసులు రెచ్చిపోయారు. దళితులను చితకబాదారు. ఈ ఘటన బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చెన్నంపల్లి ఎస్సీ కాలనీలో గణేశ్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. మూడు రోజులు కావడంతో శుక్రవారం నిమజ్జనం చేయాలని పోలీసులు సూచించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తుండగా ‘రేయ్‌.. తొందరగా తీయండి’ అంటూ కాలనీ యువకులపై పోలీసులు ఆగ్రహించారు. అంతటితో ఆగకుండా ఓ వ్యక్తిని కానిస్టేబుల్‌ కొట్టబోయాడు. ఈ దృశ్యాన్ని స్థానికుడైన హరీష్‌ అనే యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకుడు వీడియో తీస్తుండగా.. అతన్ని కానిస్టేబుల్‌ అకారణంగా కొట్టాడు. తాను విలేకరినని, ఏం తప్పు చేశానని కొట్టారంటూ కానిస్టేబుల్‌ను హరీష్‌ ప్రశ్నించాడు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌, హరీష్‌ ఇరువురూ తోపులాడుకుంటుండగా.. మరికొందరు పోలీసులు వచ్చి హరీష్‌ను చితకబాదారు. అతని చేతికి గాయమైంది. అడ్డొచ్చిన దళిత మహిళలను సైతం లాఠీలతో కొట్టారు. హరీష్‌తో పాటు మరికొంత మందిని స్టేషన్‌కు తరలించారు. కాగా, ఈ ఘటనపై సీఐ పుల్లయ్య వివరణ ఇస్తూ.. తామెవరినీ కొట్టలేదని, వారే తమ విధులకు ఆటంకం కలిగించారని చెప్పారు. పీఎస్‌ఐ కళ్యాణ్‌ చొక్కా పట్టుకుని దురుసుగా ప్రవర్తించిన హరీష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement