
ప్రతి చెరువునూ నీటితో నింపాలి
● కలెక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం అర్బన్: జిల్లాలో ప్రతి చెరువునూ నీటితో నింపాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. వివిధ అంశాలపై కలెక్టర్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి డివిజన్, మండలస్థాయి అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, ఇరిగేషన్, ఐసీడీఎస్, తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 304 చెరువులను నీటితో నింపి భూగర్భజలాలు పెంచేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఎరువుల కొరత తలెత్తకుండా చూడాలన్నారు. అధిక ధరలకు యూరియా విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మునిసిపాలిటీల్లో పారిశుధ్య పనులు వందశాతం జరగాలన్నారు. జిల్లా లోని 21 సబ్‌స్టేషన్ల చుట్టూ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ‘పీఎం కుసుమ్’ కింద 111 మెగావాట్ల సోలార్ ఇంధన ఉత్పత్తికి 499.5 ఎకరాల భూమి అవసరమవుతుందన్నారు. ప్రైవేటు భూమిని రైతుల నుంచి కొనుగోలు చేస్తామని కంపెనీలు చెబుతున్నాయన్నారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తాను కూడా ఒక సబ్‌స్టేషన్ తనిఖీ చేస్తానన్నారు. ఆర్‌డీఓలు వారి పరిధిలోని సబ్‌స్టేషన్లు తనిఖీ చేయాలన్నారు. వారం రోజుల్లో భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలోని అల్ట్రా మెగా సోలార్ పార్కు కోసం భూమిని సేకరించాలన్నారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం గుంతకల్లు, శింగనమల, రాయదుర్గం నియోజకవర్గాల్లో 50 ఎకరాల చొప్పున భూమిని గుర్తించాలన్నారు.